![విద్యార్థినికి అవార్డు అందజేస్తున్న పోలా భాస్కర్, వీసీ జింకా రంగ జనార్దన - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/17/16atpc71b-110011_mr_1.jpg.webp?itok=B_G7LyFn)
విద్యార్థినికి అవార్డు అందజేస్తున్న పోలా భాస్కర్, వీసీ జింకా రంగ జనార్దన
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వే స్తోందని కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. విద్యార్థులకు మానసిక, మేథస్సు సంబంధిత అంశాలతో పాటు ఆధ్యాత్మికతనూ పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలలను ప్రోత్సహించడానికి కళాశాల విద్య తొలిసారిగా ‘ప్రజ్ఞ యాన్యువల్ ఫెస్ట్–2023’ను శనివారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల వేదికగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన పోలా భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించి ఉన్నత విద్యరంగాల్లో మరిన్ని నూతన ఆవిష్కరణలు, సాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య మరింత పెరగాల్సిన అసవరం ఉందని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెరగాలంటే కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదన్నారు. అందరినీ బాగు చేయాలనే సంకల్పం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే విద్యార్థిలో సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందన్నారు. తరగతి బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. వీటితో పాటు సామాజిక భావోద్వేగాలను సమతుల్యం చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక ‘జాబ్ పోర్టల్’ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో వెయ్యి కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జేఎన్‌టీయూ వీసీ జింకా రంగ జనార్దన మాట్లాడుతూ ప్రపంచంలో మనదేశం యువశక్తిగా దూసుకుపోతోందన్నారు. మేథస్సు పరంగా అభివృద్ధి సాధించామని, అయితే మన ఆలోచనలు వాస్తవ రూపంలోకి ముఖ్యంగా వస్తు ఉత్పత్తిలోకి తీసుకురాలేక పోతున్నామన్నారు. కొన్నేళ్లుగా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నామన్నారు. మన ఆలోచనలను పేటెంట్స్‌గా తీసుకొచ్చి వస్తు ఉత్పత్తిలో ప్రగతి సాధిస్తే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. యువత ముందుకొచ్చి జాతినిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్ మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వివిధ అంశాల్లో ఎంపికై న 150 మంది విద్యార్థులు, అధ్యాపకులకు కమిషనర్, వీసీ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి, కళాశాల విద్య అధికారి తులసి, ఆర్జేడీలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంపొందించాలి
కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్
ఆర్ట్స్ కళాశాలలో ప్రజ్ఞ యాన్యువల్ ఫెస్ట్
Comments
Please login to add a commentAdd a comment