ప్రసవించిన అవివాహిత! | - | Sakshi
Sakshi News home page

ప్రసవించిన అవివాహిత!

Published Wed, Jul 17 2024 3:20 AM | Last Updated on Wed, Jul 17 2024 12:31 PM

ప్రసవించిన అవివాహిత!

తొలుత శిశువును వద్దనుకున్న తల్లి

అధికారుల భరోసాతో కారకు లెవరో తెలిపిన యువతి

సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు

పెళ్లి జరిపించేందుకు సిద్ధమైన పెద్దలు

రాయదుర్గంటౌన్‌: పెళ్లి కాకుండానే ఓ యువతి పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పడానికి నిరాకరించిన ఆమె తొలుత నవజాత శిశువును వద్దనుకుంది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.

అధికారుల భరోసాతో వివరాల వెల్లడి
డి.హీరేహాళ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. మంగళవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డ తండ్రి పేరు చెప్పేందుకు ఆమె నిరాకరించింది. తండ్రి, సోదరుడు కూడా తమకేమీ తెలియదన్నారు. చివరకు నవజాత శిశువును తమతో పాటు తీసుకెళ్లలేమని ఆ యువతి మొండి కేసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఈశ్వరమ్మ, డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానివ్వడంతో జరిగిన మొత్తం దారుణాన్ని బాధితురాలు వివరించింది.

తమ గ్రామానికి చెందిన యువకుడే..
రాయదుర్గం: పదో తరగతి వరకు చదువకుని మానేసిన యువతి తల్లి మూడేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి తన తండ్రి, అన్న సంరక్షణలోనే ఉంటున్న ఆమె వారితో కలసి బెంగళూరులో పనికోసం వెళ్లిన సమయంలో తమ గ్రామానికి చెందిన మంజునాథ్‌ పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో ఆమెను లోబర్చుకున్నాడు. కొన్ని రోజుల క్రితం తండ్రితో కలసి స్వగ్రామానికి చేరుకున్న ఆమె తన కడుపులో బిడ్డ పెరుగుతోందనే విషయం గుర్తించినా తండ్రి, అన్నకు చెప్పలేక పోయింది. మంగళవారం మధ్యాహ్నం కడుపులో నొప్పి అంటూ బాధపడుతున్న ఆమెను తండ్రి రాయదుర్గంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యుడు లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి చేర్చాడు. 

పరీక్షించిన వైద్యులు ఆమె పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు గుర్తించి, వెంటనే కాన్పుల వార్డులోకి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న తండ్రి, బంధువులు తొలుత ఆందోళనకు గురయ్యారు. జరిగిన విషయం మొత్తం యువతి ద్వారా తెలుసుకున్న పెద్దలు... ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇదిలా ఉండగా యువకుడు పెళ్లికి నిరాకరించి మోసం చేయాలని చూస్తే ఆందోళన చేపట్టేందుకు యువతి బంధువులు సిద్ధమయ్యారు. ఈ విషయంపై డి.హీరేహాళ్‌ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు మేజర్లు కావడంతో పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement