విత్తన వేరుశనగకు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: రబీలో వేరుశనగ సాగు చేసే రైతులు రాయితీ విత్తనాల కోసం ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లను కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకం తదితర వివరాలు సమర్పించి రాయితీ పోనూ తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. భూమి విస్తీర్ణం బట్టి ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాలు (90 కిలోలు) పంపిణీ చేస్తామని తెలిపారు. క్వింటా పూర్తి ధర రూ.9,600 కాగా 40 శాతం రూ.3,840 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,760 ప్రకారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏపీ సీడ్స్ ద్వారా ఇప్పటికే మండలాలకు విత్తన సరఫరా మొదలైందన్నారు. రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తూనే తగినంత సరఫరా కాగానే పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 20 వేల హెక్టార్లలో వేరుశనగ సాగులోకి రావచ్చని అంచనా వేయగా, 6,770 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించినట్లు తెలిపారు.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం గుంతకల్లు డివిజన్ మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19, 26వ తేదీల్లో హైదరాబాద్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరే రైలు (07135) మరుసటి రోజు సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం చేరుతుందన్నారు. 20, 27 తేదీల్లో కొట్టాయం నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరే రైలు (07136) మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుందన్నారు. అలాగే ఈ నెల 16న ఉదయం 8.20 గంటలకు నాంధేడ్ జంక్షన్ నుంచి బయలుదేరిన రైలు (07139) మరుసటి రోజు రాత్రి 10.20 గంటలకు కొల్లం రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. ఈ నెల 18న మధ్య రాత్రి 2.30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరిన రైలు (07140) మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ నెల 23, 30వ తేదీల్లో మధ్యాహ్నం 2.45 గంటలకు మౌల అలీ జంక్షన్ నుంచి బయలుదేరిన రైలు(07141) మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు కొల్లం రైల్వే స్టేషన్‌కు, తిరిగి ఈ నెల 25, డిసెంబర్ 2న కొల్లం రైల్వేస్టేషన్ నుంచి మధ్య రాత్రి 2.30 గంటలకు బయలుదేరిన రైలు (07142) మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు మౌల అలీ జంక్షన్‌కు చేరుతుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, శిరం, యాద్గరి, కృష్ట, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment