పొదుపు మంత్రం తప్పనిసరి..
అనంతపురం అగ్రికల్చర్: ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మండలాలతో పాటు మిగిలిన మండలాల్లోనూ నీటి వాడకం బాగా తగ్గించి పొదుపు చర్యలు చేపట్టకపోతే వేసవిలో మరింత ఒత్తిడి ఎదుర్కొవాల్సి ఉంటుందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో భూగర్భ జలాలు పదిలంగా ఉన్నా... 16 మండలాలు తీవ్ర నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు నివేదికలూ పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో నీటి పొదుపు చర్యలు చేపడితే వచ్చే వేసవి నుంచి గట్టెక్కవచ్చని, లేకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
క్లిష్ట పరిస్థితుల్లోనే ఆ మండలాలు..
జిల్లా వ్యాప్తంగా 97 ప్రాంతాల్లో ఉన్న ఫిజోమీటర్ల ఆధారంగా ఆ శాఖ సేకరించిన వివరాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి సగటు నీటిమట్టం 9.21 మీటర్లుగా నమోదు కావడం గమనార్హం. భూగర్భ జలాలు మెరుగుపడుతున్నట్లు భూగర్భ జలవనరుల శాఖ అంచనా వేసినా... ఇప్పటికీ 16 మండలాలు నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అనంతపురం, బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, డి.హిరేహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కూడేరు, కుందుర్పి, నార్పల, పామిడి, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, యాడికి తదితర మండలాల్లో నీటి ఒత్తిడి ఉన్నట్లు అంచనా వేశారు.
ఈ చర్యలు తప్పనిసరి
ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటలు, చెక్‌డ్యాంల మరమ్మతులు చేపట్టి భూగర్భంలో నీరు ఇంకే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరు తడి పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించడం విశేషం. యాడికి మండలం రాయలచెరువు ఫిజోమీటర్‌లో 34.90 మీటర్లలో భూగర్భజలాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే శెట్టూరు ఫిజోమీటర్‌లో 31.18 మీటర్లు, యాడికి మండలం నగరూరులో 28.80 మీటర్లు... ఇలా కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గిపోయినట్లు గుర్తించారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన ప్రాంతాలు, చెరువులు నిండిన మండలాల్లో నీటిమట్టం మెరుగుగా ఉన్నట్లు చెబుతున్నారు. 97 ఫిజోమీటర్లకు గానూ 43 ఫిజోమీటర్లలో 8 మీటర్లు అంతకన్నా ఎక్కువ లోతులో భూగర్భజలాలు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే పరిస్థితి లేనందున నీటి పొదుపు చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని హెచ్చరిస్తున్నారు.
నీటి ఒత్తిడి జాబితాలో 16 మండలాలు
నీటి పొదుపు తప్పనిసరి అంటున్న నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment