రైతులకు న్యాయం చేసే దాకా పోరు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం కుదేలైందని, సీఎం చంద్రబాబు స్పందించి రైతులకు న్యాయం చేసే దాకా తాము పోరుబాట సాగిస్తామని వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య, శింగనమల సమన్వయకర్త వీరాంజ నేయులు, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం తదితరులతో కలసి ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అన్నదాతలకు అండగా నిలబడేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోరుబాటకు పిలుపునిచ్చారన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించడమే లక్ష్యంగా ఈ నెల 13న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం జెడ్పీ కార్యాలయం ముందున్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్ వరకు సాగుతుందని, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు,నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే భారీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు.అతివృష్టి,అనావృష్టి తో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర గిట్టుబాటుకాక దళారులు, మిల్లర్లకు నష్టాలకు అమ్ముకుంటు న్నారని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మద్దతు ధరతో రైతులను ఆదుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమంటూనే అమాంతంగా పెంచేసి రూ.వేల కోట్ల భారం ప్రజలపై మోపారన్నారు. నేటికీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు.
అన్నదాతల దగా..
ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ తదితర పథకాలు అమలు చేయకుండా వంచించడమే కాకుండా ఇన్సూరెన్స్ భారం మోపి దగా చేస్తోందన్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.వందల కోట్ల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేదన్నారు. పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ ఉంతకల్లు రిజర్వాయర్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చాగల్లు, జీడిపల్లి రిజర్వాయర్ కింద రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వారిని ఆదుకోవాలన్నారు. బీటీపీ ప్రాజెక్ట్‌కు సంబంధించి 114 చెరువులకు నీరందించే పనులు చేపట్టాలన్నారు. కాలువల సామర్థ్యం పెంచేందుకు హెచ్‌ఎల్‌సీ ఆధునీకరణ చేపట్టాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ రైతులను మాత్రమే కాకుండా అన్ని వర్గాలనూ సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, టాస్క్‌ఫోర్స్ ప్రతినిధి రమేష్‌గౌడ్, పంచాయతీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాకే చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, జేసీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ వెన్నం శివరామిరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, సైఫుల్లాబేగ్, శ్రీదేవి, పార్టీ నగరా ధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నగరాధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు మీసాల రంగన్న,మాల్యవంతం మంజుల, చింతకుంట మధు, కేవీ రమణ, అమర్‌నాథ్‌రెడ్డి, రాధాకృష్ణ, ఖాజా, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.
13న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
రైతన్నకు మద్దతుగా ప్రతి ఒక్కరూ తరలిరావాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు
ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టీకరణ
Comments
Please login to add a commentAdd a comment