జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: జిల్లాలో రానున్న 4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 29.8–32.6, రాత్రి ఉష్ణోగ్రతలు 20.0–20.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 80–85 శాతం, మధ్యాహ్నం 48–63 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
నిలకడగా ఎండు మిర్చి ధరలు
హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో ఎండు మిర్చి ధరలు మంగళవారం నిలకడగా సాగాయి. మార్కెట్‌కు 164 మంది రైతులు 195.40 క్వింటాళ్ల ఎండు మిర్చి తీసుకొచ్చారు. మొదటి రకం క్వింటాలు రూ.17 వేలు, రెండో రకం రూ.8 వేలు, మూడో రకం రూ.7 వేలు ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. గత వారంతో పోలిస్తే ధరలు కాస్త పెరిగి నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో
బాలిక కిడ్నాపర్?
మడకశిర: బేగార్లపల్లికి చెందిన బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని బాలికను రక్షించినట్లు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. బాలిక మూడు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన సంగతి తెలిసిందే. కుమార్తెను రక్షించాలని తల్లిదండ్రులు సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విచారణలో జరుగుతున్న జాప్యానికి మనస్తాపం చెందిన బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేసి కిడ్నాపర్‌ను పట్టుకుని, బాలికను రక్షించినట్లు తెలిసింది. కిడ్నాపర్ అదే గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం.
ఐసీడీఎస్ పీడీగా వనజాఅక్కమ్మ
అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖ(ఐసీడీఎస్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా వనజాఅక్కమ్మ నియమితులయ్యారు. ప్రస్తుతం కంబదూరు సీడీపీఓగా పనిచేస్తున్న ఈమెకు పదోన్నతి కల్పిస్తూ ఆశాఖ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వనజాఅక్కమ్మ 1990లో సూపర్‌వైజర్‌గా మహిళా,శిశు సంక్షేమశాఖలో ప్రస్థానం ప్రారంభించారు. 1999లో సీడీపీఓగా పదోన్నతి పొందారు. హిందూపురం, గుత్తి, శింగనమల, అనంతపురం అర్బన్, కంబదూరు సీడీపీఓగా పనిచేశారు. తల్లిపాల వారోత్సవాలను మొదటిసారిగా జిల్లాలో ప్రారంభించి 2009లో జాతీయస్థాయి గోల్డ్‌మెడల్ అందుకున్నారు. అనంతరం వరుసగా రెండుసార్లు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు పొందారు. ఉత్తమ ప్రాజెక్టుగా శింగనమలకు పేరు తీసుకొచ్చారు. పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఉత్తమంగా అమలు చేసినందుకు 2014లో రాష్ట్రస్థాయి, 2019లో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. తాజాగా ఆమెకు పదోన్నతి కల్పించి రెగ్యులర్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు.
టీడీపీ కార్యకర్తల బాహాబాహీ
పెద్దవడుగూరు: మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గ్రామంలో ఉదయం తహసీల్దార్ ఉషారాణి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. మధ్యాహ్నం అధికారులు భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు యల్లావుల రామన్న అలియాస్ రమణపై దాదా, జాకీర్, రసూల్‌తో పాటు మరో ఇద్దరు దాడికి పాల్పడ్డారు. రామన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గత కొన్ని రోజులుగా గ్రామంలో రేషన్‌షాపు నిర్వహణ అంశంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే దాడులు చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment