వసతి గృహాల నిర్మాణం పూర్తిచేయాలి
అనంతపురం అర్బన్: వసతి గృహాల నిర్మాణ, మరమ్మతు పనులు సంక్రాంతిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విద్య,అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 హాస్టళ్లకు జిల్లా మినరల్ ఫండ్ కింద రూ.1.12 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం రూ.5.70 కోట్లు మంజూరు చేసిందని, ఏపీఈడబ్ల్యూఐడీసీ, పంచా యతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా 36 వసతి గృహాల్లో పనులన్నీ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. వసతి గృహాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా పరిషత్ నుంచి కేటాయించిన నిధులను అన్ని నియోజకవర్గాలకు సమాన నిష్పత్తిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డీడీ ప్రతాప్‌సూర్యనారాయణరెడ్డి, ఏపీఎం నాగరాజు, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, మైనారిటీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, ఇతర సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూభవన్‌లో లిఫ్ట్
వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌకర్యార్థం రెవెన్యూభవన్‌లో లిఫ్ట్ సదుపాయం కల్పించామని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. లిఫ్ట్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు, ఇతరాత్ర రోజుల్లో జరిగే కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చే వృద్ధులు, నడవలేనివారు, దివ్యాంగులు, గర్భిణులు మెట్లు ఎక్కి రెవెన్యూభవన్‌లోకి రావడానికి ఇబ్బందికి గురవుతుండడంతో లిఫ్ట్ సదుపాయం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ తిప్పేనాయక్, తదితరులున్నారు.
పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలి
ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ భవనంలో ప్రచార ఆధారిత కార్యక్రమాలు, ప్రజా విధానంలో ఆర్‌టీజీఎస్ నిరంతర పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాట్సాప్, మీడియా, టీవీలు, సోషల్ మీడియాలో ప్రతికూల వార్తలు లేదా ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమై సమస్యలను పరిష్కరించాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీటీసీ వీర్రాజు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, నగర పాలక కమిషనర్ నాగరాజు, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణచౌదరి తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
విజయవాడకు కలెక్టర్
అనంతపురం అర్బన్: కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. బుధ, గురువారం రెండు రోజుల పాటు కాన్ఫరెన్స్ జరగనుంది. జిల్లా అభివృద్ధికి సంబంధించి నివేదికను ఈ సందర్భంగా కలెక్టర్ సమర్పించనున్నారు. ఆయన ఈనెల 13 తిరిగి విధులకు హాజరవుతారని కార్యాలయ అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment