సర్వేకు సర్వం సిద్ధం
అనంతపురం అర్బన్: జిల్లాలో ఎంపిక చేసిన 31 గ్రామాల్లో సోమవారం నుంచి భూముల రీ సర్వే ప్రారంభం కానుంది. ఏళ్లుగా నెలకొన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమగ్ర రీ సర్వే ప్రక్రియ చేపట్టింది. ఇందుకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. సర్వే క్రమంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా మండలానికి ఒక డిప్యూటీ తహసీల్దారును మొబైల్ మెజిస్ట్రేట్‌గా నియమించింది. జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 32 మండలాల్లో 25,17,658.52 ఎకరాల రీ సర్వే చేశారు. అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) చిత్రాలను తీశారు. అదే క్రమంలో 198 గ్రామాల్లోని 1,83,353 భూ కమతాలకు చెందిన 5,88,615.626 ఎకరాలు సర్వే చేశారు. హద్దులు నిర్ధారిస్తూ రాళ్లు ఏర్పాటు చేశారు.
అంతా పక్కాగా..
రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇటీవల అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సభలను నిర్వహించారు. 1,83,353 భూ కమతాలకు గానూ 5,421 ఫిర్యాదులు (0.03 శాతం) మాత్రమే వచ్చాయంటే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సర్వే ఎంత పకడ్బందీగా చేశారనే విషయం స్పష్టమవువుతోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రీ–సర్వే కోసం తయారు చేసిన వ్యవస్థ... ప్రస్తుత కూటమి సర్కారుకు ‘వడ్డించిన విస్తరి’ అవుతోందంటే అతిశయోక్తి కాదు.
ఐదు బృందాలతో..
జిల్లావ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున 31 మండలాల పరిధిలో 31 గ్రామాల్లో రీ–సర్వే ప్రక్రియను సోమవారం ప్రారంభించనున్నారు. 31 గ్రామాల్లో 1,26,618.760 ఎకరాలు సర్వే చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో 200 ఎకరాల నుంచి 250 ఎకరాల వరకు ఒక బ్లాక్‌గా మొత్తం 31 గ్రామాల్లో 506 బ్లాక్‌లు ఏర్పాటు చేశారు. సర్వే చేసేందుకు ఒక్కో గ్రామానికి ఐదు బృందాలు నియమించారు. ఇలా 31 గ్రామాలకు 155 బృందాలు పనిచేస్తాయి. గ్రామాల్లో సర్వేకు 158 రోవర్లను ఉపయోగిస్తున్నారు.
నేటి నుంచి
31 పైలెట్ గ్రామాల్లో రీ సర్వే
155 బృందాల ఏర్పాటు
గత ప్రభుత్వంలోనే
503 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై
జగన్ సర్కారు చర్యలతో
సులువు కానున్న ప్రక్రియ
అన్ని చర్యలూ చేపట్టాం
భూముల రీ–సర్వేకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 31 గ్రామాల్లో 20వ తేదీన సర్వే ప్రారంభిస్తున్నాం. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాము. ప్రతి గ్రామంలోనూ ఐదు బృందాలు పనిచేస్తాయి.
– రూప్లానాయక్, ఏడీ,
సర్వే భూ రికార్డుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment