వ్యక్తి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: స్థానిక నేతాజీ రోడ్డులోని తాజ్‌జిన్నా ప్రాంతానికి చెందిన అబ్దుల్లా (42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య ముంతాజ్, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గార్మెంట్స్ పరిశ్రమలో జీన్స్ కటింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు లోనయ్యాడు. పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను పిలుచుకుని ముంతాజ్ గుండ్లపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న అబ్దుల్లా ఉరి వేసుకున్నాడు. గమనించి చుట్టుపక్కల వారు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అబ్దుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం మానేయమంటే.. ప్రాణం తీసుకున్నాడు!
కంబదూరు: మద్యం మానేయడం ఇష్టంలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మొదటి భార్య మృతి చెందింది. దీంతో 30 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో రోజూ తప్పతాగి ఇంటికి చేరుకునేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో తల్లి నాగమణి, భార్య చైత్ర మందలించారు. రోజూ మద్యం తాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, ఏదైనా పని చేసుకుంటూ గౌరవంగా బతుకుదామని హితవు పలికారు. అయితే మద్యానికి పూర్తి స్థాయిలో బానిసైన రాజన్న... అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇంట్లో వారు గమనించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ప్రవీన్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
రిమాండ్‌కు 11 మంది
పెనుకొండ రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వివాహితపై దాడి కేసులో 20 మందిపై కేసు నమోదు కాగా, 11 మందిని ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు కియా పీఎస్ ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. వివరాలు... పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన ఓ వివాహితపై గత బుధవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందనే అపోహతో బాలిక కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేసి జుత్తు కత్తిరించి అవమానించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు డి.శంకర, లక్ష్మీదేవి, రామస్వామితో పాటు సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ, రమేష్, శాంతి, ధనలక్ష్మి, రమణ, సుందరమ్మ, అనితను ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో తొమ్మిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment