హంద్రీ–నీవా లక్ష్యాలు దెబ్బతీస్తే సహించం
గుంతకల్లు టౌన్: హంద్రీ–నీవా ప్రాజెక్టు లక్ష్యాలు దెబ్బతీస్తే సహించబోమని కూటమి సర్కార్‌ను ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జలసాధన సమితి రాష్ట్ర నాయకుడు ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రాజెక్ట్ నిర్దేశిత లక్ష్యాలకు సమాధి కట్టేలా సీఎం చంద్రబాబు జారీ చేసిన జీఓ 404, 405ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గుంతకల్లప్ప స్వామి కల్యాణమంటపంలో జలసాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి బి.సురేష్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు విశిష్ట అతిథులుగా పౌర ప్రగతిశీల వేదిక కార్యదర్శి ధాయిపూలే తారకేష్ రావు, ప్రముఖ న్యాయవాది ఓపీడీఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హంద్రీ–నీవా ప్రధాన కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ రూ.6,182 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసిందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ పనులు ముందుకు సాగలేదన్నారు. ఆ తర్వాత ఏర్పాటైన కూటమి ప్రభుత్వం... గత ప్రభుత్వం జారీ చేసిన పరిపాలన అనుమతులను రద్దు చేస్తూ ప్రాజెక్టు ప్రయోజనాలకు సమాధి కట్టేలా జీఓ 404, 405ను విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. ఈ జీఓల ప్రకారం పనులు చేపడితే కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం కేవలం 3,850 క్యూసెక్కులకే పరిమితమవుతుందన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో రూ.వేల కోట్లను ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ప్రతిసారీ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు తీరని మోసం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. సీమ అభివృద్ధికి గండి పడుతున్నా.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కుల పెంచడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పిల్ల కాలువల ఏర్పాటు చేసి 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జీఓ.404,405ను రద్దు చేసే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. సదస్సులో న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు ఎర్రిస్వామి, దావిద్, ఆశాబీ, మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment