‘బొప్పాయి’లో యాజమాన్యం పాటించండి
బుక్కరాయసముద్రం: బొప్పాయి సాగులో యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు ఉంటాయని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,500 ఎకరాల్లో బొప్పాయి సాగులో ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బొప్పాయి పంటకు మంచి డిమాండ్ ఉందని, ఈ క్రమంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చునన్నారు. బొప్పాయి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులను ఆమె వివరించారు.
బొప్పాయి సాగు చేయాలనుకునే రైతులు తొలుత ఆరోగ్యవంతమైన మొక్కను ఎంపిక చేసుకోవాలి. కోవన్, 786 రెడ్‌లేడీ, కూర్గ హనేడ్యు, సోలో, పుసా మెజిస్టీ, సన్‌రూజ్ సోలో, సూర్య, ఆర్క ప్రభాత్, వాషింగ్‌టన్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు 1000 మొక్కలు చొప్పున నాటుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య 6X7 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. మొక్కల గుంతలోకి పశువులఎరువు, వేప పిండి వేసుకోవాలి. విత్తనాలైతే ఒక సెంటీమీటరు లోతు మించకుండా విత్తుకోవాలి. విత్తు వేసే ముందు భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుతో దుక్కి చేయాలి.
బొప్పాయి సాగులో వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఆకు ముడత, రింగ్ స్పాట్ వైరస్ ప్రధానమైనవి. రసం పీల్చే పురుగులు బొప్పాయి నారను ఆశించకుండా 40X60 అడుగుల పరిమాణమున్న లాన్ మెష్ నెట్ హౌస్‌లో పెంచాలి. బొప్పాయి తోట సాగు సమయంలో చుట్టూ రెండు వరుసల మొక్కజొన్న లేదా అవిశను రక్షణగా వేయాలి. ఇలా చేయడం ద్వారా రసం పీల్చే పురుగును నివారించవచ్చు. రసం పీల్చే పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీ వేప నూనె, 2.5 గ్రాముల అసిపేట్ కలిపి పిచికారీ చేయాలి. రింగ్‌స్పాట్ వైరస్ నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 1. గ్రాము బోరాజ్ కలిపి పిచికారీ చేయాలి. కాండం కుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోర్డో మిశ్రమం, 2 గ్రాముల అలియేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2, 3 సార్లు మొక్క మొదలు బాగా తడపాలి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి గంధకం (నీటిలో కరిగే) 3 గ్రాములు, 2 మి.లీ. కెరాథేన్ (1 మి.లీ.) కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
పంట కోత, దిగుబడి
ఎకరాకు వెయ్యి బొప్పాయి మొక్కలు చొప్పున నాటుకుంటే 25 నుంచి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పంట సాగు చేసిన 7 నెలల కాలం నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంది. ఇలా 5 నుంచి 8 నెలల వరకు పంట కోతకు వస్తుంది. తర్వాత కూడా ఏడాదిన్నర పాటు పంట వస్తుంది. అయితే కాయ పరిమాణంలో మార్పు ఉంటుంది. ఒక ఎకరా పొలంలో బొప్పాయి సాగుకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బొప్పాయి రూ. 14 నుంచి రూ.17 చొప్పున అమ్ముడు పోతోంది. ఈ లెక్కన టన్ను బొప్పాయికి రూ.17 వేల చొప్పున ఎకరాకు రూ.4లక్షల వరకు కచ్చితమైన ఆదాయం ఉంటుంది.
సమగ్ర యాజమాన్యం ఇలా..
తెగుళ్ల యాజమాన్యం
Comments
Please login to add a commentAdd a comment