రెవెన్యూ ఉద్యోగుల స్పోర్ట్, కల్చరల్ అసోసియేషన్ కమిట
అనంతపురం అర్బన్: రెవెన్యూ ఉద్యోగుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం అనంతపురంలోని కృష్ణకళామందిర్‌లో ఉన్న రెవెన్యూ హోమ్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌని సంజీవరెడ్డి, కార్యదర్శిగా పుట్లూరు హరిప్రసాదరెడ్డి, కోశాధికారిగా కె.శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షులుగా టి.హరిప్రసాద్, చంద్రరేఖ, పి.మూర్తి, ప్రసాదరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా పి.నారాయణస్వామి, ఎస్.షాహిద్ అక్రమ్, డి.భరత్ ఎన్నికయ్యారు. నూతన సభ్యులను డీఆర్‌ఓ మలోల, ఆర్‌డీఓ కేశవనాయుడు అభినందించారు. అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
పాడి ఆవును బలిగొన్న
ప్లాస్టిక్ వ్యర్థాలు
పుట్టపర్తి అర్బన్: ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్న ఓ పాడి ఆవు మృతి చెందింది. వివరాలు.. పుట్టపర్తి మండలం గువ్వలగుట్టపల్లికి చెందిన గోపాలరెడ్డి ప్రభావతి దంపతులు పాడి పోషణతో జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది రూ.80 వేలు వెచ్చించి ఓ ఆవును కొనుగోలు చేశారు. రోజూ పది లీటర్ల మేర పాలు ఇస్తున్న ఈ ఆవు వారం రోజులుగా మేత మేయక తీవ్ర అనారోగ్యం బారిన పడింది. గోరంట్లకు చెందిన పశు వైద్యుడు శివారెడ్డితో చికిత్స చేయించారు. అయినా ఫలితం దక్కక ఆదివారం మృత్యువాతపడింది. పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహిస్తే ఆవు పొట్ట నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు, చీరలతో పేనిన తాడు వ్యర్థాలు బయటపడ్డాయి. గమనించిన రైతు దంపతుల బోరున విలపించారు.
వ్యక్తి దుర్మరణం
లేపాక్షి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని జీలగుంట గ్రామానికి చెందిన వెంకటేష్(45) వ్యక్తిగత పనిపై హిందూపురానికి శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. లేపాక్షి మండలం వెంకటాపురం క్రాస్ వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహన వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment