సందడిగా 10 కే రన్.. 5కే వాక్
అనంతపురం: నగరంలో ఆదివారం 10కే రన్, 5కే వాక్ సందడిగా సాగాయి. ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలను స్థానిక కలెక్టరేట్ వద్ద కలెక్టర్ వినోద్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించాలని పిలుపునిచ్చారు. స్పెయిన్ నుంచి వచ్చిన వారికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఐఏఎస్ శిక్షణ సమయంలో ముస్సోరిలో నిర్వహించిన ఇలాంటి కార్యక్రమంలో 11వ స్థానంలో నిలిచినట్లు గుర్తు చేసుకున్నారు. కాలికి చిన్న గాయమైన కారణంగా పోటీల్లో పాల్గొనలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ మాట్లాడుతూ ‘అల్ట్రా ఫెర్రర్ రన్నింగ్’ పది సంవత్సరాల క్రితం ప్రారంభమైందన్నారు. పెద్ద ఎత్తున రన్నర్స్ రావడం సంతోషంగా ఉందన్నారు.గతంలో స్పెయిన్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారని, కానీ ఇప్పుడు జిల్లా నుంచే చాలా మంది రన్నర్స్ పాల్గొనడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆర్డీటీ మహిళా సాధికారిత డైరెక్టర్ విశాల ఫెర్రర్, ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, అల్ట్రా రన్నర్ జువాన్ వియోరా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment