ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం లేదని డీఆర్‌ఓ ఎ.మలోల తెలిపారు. ఎస్సీ ఉప వర్గీకరణపై అభిప్రాయాల సేకరణకు ఏకసభ్య కమిషన్ విచ్చేస్తున్న నేపథ్యంలో పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాలయాల్లో యథావిధిగా జరుగుతుందని, అర్జీలను అక్కడే సమర్పించాలని తెలియజేశారు.
అంగన్‌వాడీల్లో
ఆధార్ క్యాంపులు
అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ఆదేశించారు. ఒకవేళ అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహణకు సౌకర్యాలు లేకుంటే సచివాలయాల్లోనైనా ఏర్పాటు చేయాల్సిందేనని, అందుకు సీడీపీఓలు, సూపర్‌వైజర్లు చొరవ చూపాలని స్పష్టం చేశారు. మండల స్థాయి సమావేశాల అనంతరం ఏ రోజు ఎక్కడ క్యాంపు నిర్వహించేది అధికారులు తేదీలు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. మంగళవారం నుంచి ఆధార్ క్యాంపులు విధిగా ప్రారంభమవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి పిల్లాడికి సంబంధించిన రిమార్క్స్ కచ్చితంగా నమోదు చేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే ఆధార్ విభాగం జిల్లా కో–ఆర్డినేటర్ నారపరెడ్డిని సంప్రదించాలని సూచించారు.
వలస బాటలో మృత్యువాత
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృత్యువాత పడ్డాడు. అయిన వారికి తీరని శోకం మిగిల్చాడు. వివరాలు.. రాయదుర్గం మండలంలోని రాయంపల్లికి చెందిన విశ్వనాథ్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఎక్కడా ఉపాధి దొరక్కపోవడంతో కుటుంబ పోషణ కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు 15 రోజుల క్రితం విశ్వనాథ్ వలస వెళ్లాడు. అక్కడ కూలీ పనులకు వెళ్తూ వారానికోసారి భార్యకు నగదు పంపుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం పని ప్రాంతానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు అక్కడి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన విశ్వనాథ్.. ఆదివారం ప్రాణాలు వదిలాడు. పెద్ద దిక్కు మృతితో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. మండలంలో ఉపాధి పనులు సక్రమంగా కల్పించకపోవడంతోనే వలసలు పెరుగుతున్నాయని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.27 లక్షల పత్తి.. ఆహుతి
రాప్తాడు: మండల కేంద్రం సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత లారీలో తరలిస్తున్న పత్తి దగ్ధమైంది. లారీ డ్రైవర్ సెవెన్ జంగమ్ తెలిపిన మేరకు... మహారాష్ట్రలోని అహమ్మద్‌నగర్ జిల్లా షేగావ్ తాలుకాలో ఉన్న రిద్దిసిద్ది కోట్యాక్స్ కంపెనీ ప్రైవెట్ లిమిటెడ్ నుంచి రూ.27,23,242 విలువ చేసే 17 టన్నుల పత్తిని తమిళనాడులోని మినపరాయ్ స్పిన్నింగ్ మిల్‌కు కేఎ01ఎఏం 1460 నంబర్ గల లారీలో తరలింపు చేపట్టారు. శనివారం రాత్రి 8.30 గంటలకు రాప్తాడు వద్ద జాతీయ రహదారిపై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ లారీని ఆపి అక్కడే ఉన్న హోటల్‌లో భోజనం చేశారు. అనంతరం లారీ వద్దకు చేరుకోగా అప్పటికే పొగలు వస్తుండడం గమనించి వెంటనే టార్పాలిన్‌ను తొలగించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో పత్తి బేళ్లను కిందకు పడేయడంతో లారీకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment