పశువులు, జీవాల సంరక్షణ చేపట్టండి
గుమ్మఘట్ట: మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పశువులు, జీవాల సంరక్షణ చర్యలు చేపట్టాలని రైతులు, కాపరులకు పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ రజనీకుమారి సూచించారు. మండలంలోని రంగచేడు, నేత్రపల్లి గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీకాల ఆవశ్యకత, నట్టల నివారణపై రైతులు, కాపరులను చైతన్య పరిచారు. పశువులు, గొర్రెలు, లేగదూడలకు నట్టల నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభిచారు. నేత్రపల్లిలో శిథిలావస్థకు చేరుకున్న పశువుల ఆస్పత్రిని పరిశీలించారు. ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపి నూతన భవన నిర్మాణానికి నిధులు సమీకరించి పనులు చేపడతామని గ్రామస్తులకు భరోసానిచ్చారు. అనంతరం గుమ్మఘట్టలోని పశువుల ఆస్పత్రిని సందర్శంచి రికార్డులు పరిశీలించారు. పశువైద్యాధికారి డాక్టర్ నవీన్‌కుమార్ మాట్లాడుతూ... గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ద్వారా 332 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, 224 పశువులకు, లేగదూడలకు నట్టల నివారణ టీకాలు, 38 పశువులకు గర్భకోశ చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేడీ వెంకటస్వామి, డీడీ డాక్టర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
భార్యకు చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేక వ్యక్తి ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సుందర్రాజు (41)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రోజూ కూలి పనులు చేస్తే తప్ప పూట గడవని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత కాలంగా భార్య అనారోగ్యం బారిన పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూపించినా జబ్బు నయం కాలేదు. దీనికి తోడు రోజురోజుకూ భార్య ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించే ఆర్థిక స్థోమత లేక తీవ్ర మనోవేదనకు లోనైన సుందర్రాజు గురువారం ఉదయం ఇంట్లోనే తన భార్య చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు... సుందర్రాజు మృతదేహంపై పడి బోరున విలపించారు. సుందర్రాజు తల్లి రామలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment