ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు
అనంతపురం అర్బన్: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాప్తాడు మండలంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అధికారులందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయ చేయాలంటూ మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. అన్యాయంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయడం లేదు’ అంటూ కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఎదుట రాప్తాడు మండల వాసులు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని చాంబర్ వద్ద కలెక్టర్ వినోద్‌కుమార్‌ను బాధితులు శూలం పెద్ద ఓబులేసు, పి.లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ రామాంజినేయులు, వైఎస్సార్‌సీపీ మాజీ కన్వీనర్ జూటూరు శేఖర్, నాయకులు ఆదినారాయణరెడ్డి, రామలింగయ్య, కాటంరెడ్డి, ముత్యాలు, రవికుమార్, సింగారప్ప, తదితరులు కలసి వినతిపత్రం అందజేసి, ప్రస్తుత పరిస్థితి వివరించారు. పుల్లలరేవు రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 83–3లో రైతు ఓబులేసు తనకున్న 2.86 ఎకరాల పొలంలో 200 నేరేడు చెట్లు పెంచుతుంటే ఇందులో 47 చెట్లను నరికేశారన్నారు. ఈ నెల 19న, 21న రెండు సార్లు పోలీసులకు బాధితుడు చేసిన ఫిర్యాదు బుట్టదాఖలైందన్నారు. మొత్తం 10 మందిపై ఫిర్యాదు చేస్తే కేవలం ఐదుగురిపైనే కేసు నమోదు చేసి మిగిలిన వారిపై కేసు నమోదు చేయలేమని చెబుతున్నారని వాపోయారు. చెట్లు నరికిన వారిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే గోందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 128–2ఎ, 2బిలో 1.78 ఎకరాల భూమి రైతు లక్ష్మీనారాయణకు ఉందన్నారు. పంటకు సత్తువ చేసేందుకు ఎర్ర మట్టి అవసరం కావడంతో భూమికి దక్షిణం వైపు ఉన్న ప్రభుత్వ గుట్ట నుంచి మట్టి తవ్వుకునేందుకు తహసీల్దారుకు గత ఏడాది డిసెంబరు 30న లక్ష్మీనారాయణ అర్జీ ఇచ్చాడని గుర్తు చేశారు. దీనిపై తహసీల్దారు స్పందించి ఆర్‌ఐ, వీఆర్‌ఓకు ఎండార్స్ చేస్తే స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో అనుమతులు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని వాపోయారు. భూమికి ఎర్రమట్టి తోలుకునేందుకు అనుమతి మంజూరు చేసేలా తహసీల్దారుకు ఆదేశాలిచ్చి న్యాయం చేయాలని కోరారు.
ఫిర్యాదు చేసిన పట్టించుకోవం లేదు
కలెక్టర్ వినోద్‌కుమార్‌కు రాప్తాడు వాసుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment