● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం సెంట్రల్: అనంతపురం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ కన్వెన్షన్ హాలులో ఈ నెల 5న ‘అనంత’ ఉద్యాన సమ్మేళనం (హార్టికల్చర్ కాంక్లేవ్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం రెవెన్యూభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంక్లేవ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్‌లతో పాటు 16 మంది దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఐటీసీ, స్విగ్గీ, జొమాటో, రిలయన్స్, మైక్రో అగ్రీ సొల్యూషన్స్, నెటా ఫిమ్ ఇరిగేషన్, ఆగ్రో లైఫ్ స్టైల్ కార్పొరేషన్, కోరమాండల్ ఇంటర్నేషనల్, జీఎం పవర్ సిస్టం, ఫసల్ లాంటి సంస్థలతో పాటు 64 జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా 6 ఎంఓ యూలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, డీఆర్వో మలోల, హార్టికల్చర్ డీడీ నరసింహారావు, వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీటీడబ్ల్యూ రామాంజనేయులు, హార్టికల్చర్ అధికారి పల్లవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment