సాక్షి, వైఎస్‌ఆర్ కడప: జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..
పులివెందులలో డా. వైఎస్‌ఆర్ బస్ టెర్మినల్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. మిగిలిన బస్టాండ్లకు రోల్‌మోడల్‌గా పులివెందుల బస్టాండ్ తీర్చిదిద్దాం. ఒకవైపు బస్ టెర్మినల్ పనులు కనిపిస్తున్నా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు టెర్మినల్ పనులు జరుగుతున్నా కూడా.. నెగెటివ్ మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి చెడిపోయిన వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ వ్యవస్థలో చంద్రబాబు, టీడీపీతో పాటు ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక దత్తపుత్రుడు భాగం అయ్యారు. వీళ్ల తీరు ఎలా ఉందంటే..
చంద్రబాబు తీరు ఎలా ఉందంటే.. ఒక గ్లాస్‌లో 75 శాతం నీళ్లు ఉన్నా.. అసలు గ్లాసులో నీళ్లు లేవనే ప్రచారం చేస్తున్నారు. గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్. గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది? అని సీఎం జగన్ ప్రతిపక్ష టీడీపీని నిలదీశారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు తక్కువేనని సీఎం జగన్ స్పష్టం చేశారు.
జరిగిన అభివృద్ధి చూస్తే.. పులివెందులలోనే ఉన్నామా? అనిపిస్తోంది. సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి. అవినీతికి తావు లేకుండా సంక్షే పథకాలు అందిస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. పులివెందులలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2023 నాటికి పూర్తవుతుంది. వేంపల్లెలలో రహదారుల విస్తరణకు భూసేకరణ కూడా జరిగింది. వచ్చే రెండేళ్లలో పులివెందులను ఒక నగరంగా మార్చే పరిస్థితికి చేరుకుంటుంది. ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ఆకాంక్షించారు. దేవుడి దీవెనలతో.. ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేసే అవకాశం తనకు కలగాలని ఆయన కోరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment