సాక్షి, అమరావతి: కరోనా బారినపడిన చిన్నారులకు రకరకాల యాంటీవైరల్, యాంటీబయోటిక్స్ మందులను ఉపయోగించవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. నెలల వయసుండే చిన్నారులు రకరకాల యాంటీవైరల్ మందులను తట్టుకునే పరిస్థితి ఉండదని పేర్కొంది. చిన్నారులకు ప్రత్యేక ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్‌ను నిర్దేశించింది. పిల్లల్లో ప్రధానంగా జ్వరం లక్షణాలు గమనిస్తూ, ఆక్సిజన్ సాంద్రత పరిశీలిస్తుండాలని సూచించింది. ఆ ప్రొటోకాల్ ప్రకారం..
ఈ మందులు అవసరం లేదు
ప్రస్తుతం కొన్ని మందులు పెద్దవాళ్లు వాడుతున్నారు. వీటిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఫావిపిరావిర్, ఐవెర్‌మెక్టిన్, లోపినవిర్/రిటొనవిర్, రెమ్‌డెసివిర్, తోసిలిజుమాబ్, ఇంటర్‌ఫెరాన్ వంటివి పిల్లలకు అవసరం లేదు. పైగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల చిన్నారుల్లో కనిపించిన ఫలితాల డేటా ఇంతవరకు లేదు. చిన్నారుల్లో తరచూ 100.4 జ్వరం వస్తుంటే లక్షణాలున్నట్టు గుర్తించాలి. ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు చేయించవచ్చు. పల్సాక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ శాతం పరీక్షించి ఆక్సిజన్ సాంద్రత 94 కంటే తక్కువగా ఉంటేనే సివియర్‌గా గుర్తించాలి. తల్లిదండ్రులు తమ ముక్కు, నోటికి దగ్గరగా బిడ్డను ఎత్తుకుని తిరగకూడదు. దీనివల్ల తల్లిదండ్రులు వదిలే గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.
పారాసిటమాల్ విధిగా..
పిల్లల్లో జ్వరం వస్తుంటే ప్రతి 4–6 గంటలకు పారాసిటమాల్ 10–15 ఎంజీ వేయవచ్చు. వెచ్చని సెలైన్ గార్గల్స్ వంటి గొంతుకు సంబంధించిన చికిత్స చేసుకోవచ్చు. యాంటీబయోటిక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. తల్లిదండ్రులు బిడ్డలో లక్షణాలు నిర్ధారించుకోవడానికి శరీరం నీలిరంగులోకి మారడం, మూత్ర విసర్జనలో తేడా, ఆక్సిజన్ సాంద్రత తగ్గడం వంటివి చూసి తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment