‘‘ఇప్పటికే రాష్ట్రంలో ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, రిటైల్ వంటి వ్యాపారాల్లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో మరో రూ.50,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాం’’.
– విశాఖ జీఐఎస్ సదస్సులో ముఖేష్ అంబానీ
‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశం ఎల్లప్పుడూ సమగ్రంగా ఫలపద్రంగా జరుగుతుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన కీలక ప్రాజెక్టులు గంగవరం పోర్టు, వైజాగ్ డేటా సెంటర్ వంటి వాటిపై చర్చించాం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ రెండు ప్రాజెక్టులు అత్యంత కీలకమవుతాయని ఇరువురం భావిస్తున్నాం’’.
– ఈ ఏడాది సెప్టెంబర్ 29న సీఎంను కలిసిన అనంతరం గౌతమ్ ఆదానీ ట్వీట్
సాక్షి, అమరావతి : .. ఇలా గతంలో ఎప్పుడూలేని విధంగా రాష్ట్రంలో అంబానీ, ఆదానీ, మిట్టల్, టాటా, బిర్లా, జీఎంఆర్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి ఓ వైపు ముందుకొస్తుంటే.. మరోవైపు ఈనాడు రామోజీరావు ఇది తట్టుకోలేక పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తన బాబు పాలనలో రాకుండా ఇప్పుడు వీరంతా రాష్ట్రానికి క్యూ కట్టడంపై ఆయన పగబట్టినట్లుగా రంకెలు వేస్తున్నారు. పరిశ్రమలపై కక్షగట్టి వెళ్లగొడుతున్నారని లేనిపోని కథలల్లి ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారు.
గతం కంటే ఇప్పుడు అధిక పెట్టుబడులు పెడుతున్నామంటూ అంబానీ, ఆదానీలు స్వయంగా ప్రకటించినా చెవికెక్కని రామోజీ.. ఆ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయంటూ తన విషపుత్రిక ఈనాడులో నిస్సిగ్గుగా ఓ అడ్డగోలు కథనాన్ని అచ్చోసింది. గత ప్రభుత్వం కుదుర్చుకున్న పరిశ్రమలను ఈ ప్రభుత్వం కక్షగట్టి వెళ్లిగొట్టిందంటూ రాసిన కథనం అవగాహనా రాహిత్యంతో పాఠకులను కావాలని తప్పుదోవ పట్టించేలా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఖండించింది. 2019 నుంచి రాష్ట్రంలో భారీగా పరిశ్రమలు ఏర్పాటవుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని.. జీఎస్‌డీపీలో పరిశ్రమల వాటా పెరగడం, ప్రజల తలసరి ఆదాయం పెరగడం ఇందుకు నిదర్శనమని ఆ శాఖ పేర్కొంది. ఉదా..
► 2022–23లో దేశ జీడీపీ 15.90 శాతం వృద్ధి నమోదు చేస్తే రాష్ట్రం అంతకంటే ఎక్కువగా 16.22 శాతం వృద్ధిని నమోదు చేసింది.
► 2019–20లో రాష్ట్ర జీఎస్‌డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా 2022–23 నాటికి అది 23.36 శాతానికి చేరింది. దీన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్తోంది.
► అలాగే, గతేడాదితో పోలిస్తే దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగితే మన రాష్ట్రంలో మాత్రం రూ.26,931 పెరిగింది.
► ఇక 2021–22లో రూ.1,92,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరింది.
► ఇదే సమయంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 10.59 శాతం వృద్ధితో రూ.1.59 లక్షల కోట్లకు చేరడం ద్వారా ఆరో స్థానానికి ఎగబాకిందని పరిశ్రమల శాఖ తెలిపింది.
సులభతర వాణిజ్యంలో ఏపీ టాప్..
ఇక గత మూడేళ్లుగా పూర్తిగా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో విడుదల చేస్తున్న సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ మొదటిస్థానంలో నిలుస్తోంది. ఇది కాకుండా ఎగుమతుల సన్నద్ధత ర్యాంకుల్లో 8వ స్థానానికి.. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు సంబంధించి లీడ్స్–2023 ర్యాంకుల్లో టాప్ అచీవర్‌గా మన రాష్ట్రం నిలిచింది. వాస్తవ గణాంకాలిలా ఉంటే పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి.. విద్యార్థులకు ఉద్యోగాల్లేవంటూ ఏ ఆధారాల్లేకుండా తప్పుడు వార్తలెలా రాస్తారంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఐదేళ్ల వాస్తవ పెట్టుబడిని వక్రీకరించేశారు..
అదానీ డేటా సెంటర్ గురించి ఈనాడు ఈ మధ్య రెండు కథనాలను ప్రచురించింది. ఐటీ రంగం గురించి రాస్తున్నప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో వచ్చే 20 ఏళ్లలో ఆదానీ డేటా సెంటర్ కోసం రూ.70,000 కోట్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం చేసుకుంటే ఈ ప్రభుత్వ తీరుతో ఈ మొత్తాన్ని రూ.21,844 కోట్లకు తగ్గించుకుందని రాశారు. వెంటనే రెండ్రోజుల తర్వాత ప్రచురితమైన ‘కక్షగట్టి పరిశ్రమలు వెళ్లగొట్టి’.. అన్న కథనంలో మొత్తం రూ.70,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రం నుంచి తరలిపోయినట్లు చేతికొచ్చింది రాసిపారేశారు.
నిజానికి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇరవై ఏళ్లు అంటే చాలా సుదీర్ఘ సమయమని, అప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో పెనుమార్పులు వస్తాయి కాబట్టి వచ్చే ఐదేళ్లలో ఎంత వాస్తవ పెట్టుబడి పెడతారో డీపీఆర్ ఇవ్వాల్సిందిగా కోరింది. దీని ప్రకారం ఐదేళ్ల కాలానికి రూ.21,844 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆదానీ గ్రూపు స్పష్టంచేసి దానికనుగుణంగా ఇప్పటికే పనులను మొదలుపెట్టంది. ఇప్పుడు ఆదానీ డేటా సెంటర్‌ను వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో అభివృద్థి చేస్తోంది.
చంద్రబాబు హయాంలో కేవలం ప్రకటనలకే పరిమితమైన ఆదానీ గ్రూపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఇదే విషయాన్ని ఆదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీసెజ్) సీఈఓ కరణ్ అదానీ విశాఖ జీఐఎస్ సదస్సులో స్పష్టంచేశారు. పోర్టులు, సిమెంట్ వంటి రంగాల్లో ఆదానీ గ్రూపు ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. భవిష్యత్తులో ఈ రంగాల్లో తమ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు కరణ్ ఆదానీ ప్రకటించారు. అదే విధంగా రాష్ట్రంలో డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీతో పాటు వివిధ రంగాల్లో కొత్తగా మరో రూ.43,664 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఏపీఐఐసీ లేఖలకు స్పందించని లులూ..
ఇక విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం లులూ గ్రూపునకు కేటాయించింది. కానీ. ఈ భూమికి చెల్లించాల్సిన మొత్తం లూలు గ్రూపు చెల్లించడంలో విఫలమైంది. ఏపీఐఐసీ అనేకసార్లు భూమి ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమిని అప్పగిస్తామంటూ లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఏపీఐఐసీ భూమిని కేటాయించలేదు.
మరోవైపు.. ఓర్వకల్లు వద్ద జయరాజ్ స్టీల్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోయినా ఎటువంటి పెనాల్టీలు విధించలేదు. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది మార్చి నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.
అవగాహనారాహిత్యంతో వార్తల అల్లిక..
నిజానికి.. ఏదైనా ఒక పరిశ్రమ ప్రారంభం కావాలంటే ప్రతిపాదన దగ్గర నుంచి సాంకేతిక మదింపు, అనుమతులు పేరిట ఒక నిర్థిష్టమైన నియమ నిబంధనలు (ఎస్‌ఓపీ) ఉంటాయని, వీటిపై అవగాహన లేకుండా ఈనాడు వార్తలు రాసినట్లు ఉందని పరిశ్రమల శాఖ ఆ ఖండనలో పేర్కొంది. తమ వ్యాపార నిర్ణయాల్లో భాగంగా ఆయా కంపెనీలు పనులు ప్రారంభించలేదని స్పష్టంచేసింది.
రానున్న కాలంలో ఎంఎస్‌ఎంఈలతో కలిసి రాష్ట్రంలో కొత్తగా 3,69,831 యూనిట్లు రానున్నాయని, వీటి ద్వారా రూ.14,18,943 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రావడమే కాకుండా 32,30,425 మందికి ఉద్యోగావకాశాలు, పరోక్షంగా 64,60,850 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, ఆ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment