Fact Check: నిద్ర 'కరువై' నీచపు రాతలు.. | Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt | Sakshi
Sakshi News home page

Fact Check: నిద్ర 'కరువై' నీచపు రాతలు..

Published Sun, Jan 28 2024 5:50 AM | Last Updated on Sun, Jan 28 2024 5:31 PM

Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు మత్తులో రామోజీ కూరుకుపోయారు. ఆ మైకంలోనే ఆయన పగలూ రాత్రి అనే తేడా లేకుండా జోగుతున్నారు. తన విషపుత్రిక ఈనాడులో ఏం రాస్తున్నారు.. అందులో వాస్తవాలేమిటో తెలుసుకోలేనంత “స్పృహ’లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటుంటే రామోజీరావు మాత్రం చంద్రబాబు మైకంలో పడిపోయి నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే సీజన్‌లో ఏకంగా నాలుగుసార్లు సబ్సిడీ విత్తనాలు అదీ కూడా 40–80 శాతం సబ్సిడీపై అందించి అండగా నిలిస్తే ఈనాడుకు అది కన్పించలేదు.

సీజన్‌ ముగియకుండానే కరువు మండలాలను ప్రకటించినా కన్పించలేదు. సాధ్యమైనంత ఎక్కువగా సాయపడాలన్న సంకల్పంతో పెట్టుబడి సాయాన్ని పెంచినా కన్పించలేదు. ఆఘమేఘాల మీద కరువుతో పాటు మిచాంగ్‌ తుపాను పంట నష్టం లెక్కతేల్చి పరిహారం పంపిణీకి ఏర్పాట్లుచేస్తుంటే అదీ కన్పించలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏదో విధంగా రైతులను గందరగోళపర్చాలన్న లక్ష్యంతో కాకిలెక్కలతో బురద రాతలు రాస్తూ ఈనాడు విషప్రచారం చేస్తోంది. తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం ఇక ఎప్పటికీ దక్కదేమోనన్న దుగ్థతో రోజూ నిద్ర కరువై నీచపు రాతలతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై పేట్రేగిపోతున్నారు. తాజాగా.. ‘ప్రభుత్వం మొద్దునిద్ర’ పోతోందంటూ శనివారం అచ్చేసిన కథనంలో అంశాలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్‌చెక్‌’ ఏమిటంటే.. 

అడుగడుగునా రైతులకు అండగా.. 
నిజానికి.. వర్షాభావ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆ ప్రభావం రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో కన్పించింది. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 84.97 లక్షల ఎకరాలు కాగా.. వర్షాభావ పరిస్థితుల వలన ఖరీఫ్‌–2023 సీజన్‌లో 63.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 21.51 లక్షల ఎకరాల్లో సాగు తగ్గితే ఈనాడు మాత్రం పనిగట్టుకుని 31 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వలేదంటూ ఇష్టమొచ్చినట్లు రాసిపారేసింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో తొలుత 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. బెట్ట పరిస్థితుల వలన ఏటా వేసే పంట వేయలేని రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద పంటల విత్తనాలను 80 శాతం రాయితీపై ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా చేశారు.

రూ.26.46 కోట్లు సబ్సిడీ భరించి 1.16 లక్షల మంది రైతులకు 30,977 క్వింటాళ్ళ వరి, కొర్ర, మినుము, పెసర, కంది, ఉలవలు, జొన్న, అలసంద, మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. అవసరమైన చోట లేట్‌ ఖరీఫ్‌ కింద రైతులకు వరి, ఇతర పంటలను సాగుచేయడానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలను క్షేత్రస్థాయికి పంపి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించడమే కాక.. బెట్ట పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఫలితంగానే రాష్ట్రంలో 63.46 లక్షల ఎకరాలు పంటలు సాగయ్యాయి. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రెండో ముందస్తు అంచనా ప్రకారం రికార్డు స్థాయిలో 154.73 లక్షల టన్నుల దిగుబడులు కూడా వచ్చాయి.  

తెలంగాణలో 31 జిల్లాల్లో వర్షాభావం.. 
రబీ సీజన్‌లో కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా జనవరిలో నమోదైన వర్షపాతమే ఇందుకు నిదర్శనం. ఇక దేశవ్యాప్తంగా 327 జిల్లాల్లో చినుకు పడని పరిస్థితి నెలకొంటే.. 143 జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం, 73 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. పొరుగునున్న తెలంగాణలో 33 జిల్లాలకుగాను 31 జిల్లాల్లో చుక్కనీరు కూడా పడని పరిస్థితి నెలకొంది. కానీ, ఏపీలో ఏడు జిల్లాల్లో అధిక లోటు వర్షపాతం నమోదు కాగా.. మరో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఐదు జిల్లాల్లో సాధారణ, అధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.  

రబీలో రెండుసార్లు సబ్సిడీ విత్తనం.. 
వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో పంటలు సాగుచేయలేని రైతులు ముందస్తు రబీకి సిద్ధంకావడంతో వారి కోసం ప్రత్యేకంగా 40 శాతం సబ్సిడీపై రైతులకు 3.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. మిచాంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కొన్ని జిల్లాల్లో నారుమళ్లు, మరికొన్నిచోట్ల నాట్లు దెబ్బతిన్నాయి. ఇలా పంటలు దెబ్బతిన్న 16 జిల్లాల్లో రూ.65 కోట్లు ఖర్చుచేసి 85,645 క్వింటాళ్ల విత్తనాన్ని 80 శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా మరోసారి సరఫరా చేశారు.

ఇప్పటికే  50వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుము, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను రూ.29.69 కోట్ల విలువైన రాయితీతో 61 వేల మంది రైతులకు అందజేశారు. ఫలితంగా.. రబీ 2023–24 సీజన్‌లో 55.27 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 32 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధాన పంటలైన వరి 19.5 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 10.50 లక్షల ఎకరాలలో వరినాట్లు వేశారు. ఇంకా పలు జిల్లాల్లో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి, 10 రోజుల్లో అవి పూర్తవుతాయి. మిగిలిన పంటలు కూడా సీజన్‌ ముగిసేలోపు నిర్ధేశించిన లక్ష్యం మేరకు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. 

త్వరలో కరువు, తుపాను సాయం పంపిణీ 
ఇక ఖరీఫ్‌–2023లో సంభవించిన కరువు ప్రభావాన్ని గుర్తించడమే కాదు.. సీజన్‌ ముగియకుండానే ఏడు జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తుది నివేదికల ఆధారంగా 14.07 లక్షల ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లుగా గుర్తించారు. 6.96 లక్షల మంది రైతులకు రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. మరోవైపు.. డిసెంబరులో విరుచుకుపడిన మిచాంగ్‌ తుపాను  ప్రభావంతో 6.56 లక్షల ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయిన 4.61 లక్షల రైతులకు రూ.442.36 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు.

కరువు, మిచాంగ్‌ తుపాను సాయాన్ని త్వరలో రైతుల ఖాతాలో జమచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. సాధారణంగా వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రామాణికాల మేరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒకే రకంగా వర్తించే విధంగా అర్హతలను నిర్ణయిస్తే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పంట సాగు పరిస్థితులను బట్టి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల మేరకు పంట నష్టపరిహారం నిర్ణయిస్తుంది. పెట్టుబడి రాయితీని లెక్కగట్టే విషయంలో దశాబ్దాలుగా సాగుతున్న విధానం ఇది. 

కేంద్రం కంటే మిన్నగా పెట్టుబడి సాయం.. 
కానీ.. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్ణయించిన పెట్టుబడి రాయితీ సొమ్ము కన్నా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో ఎకరానికి ఇచ్చే పెట్టుబడి రాయితీని భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇలా కేంద్రం కంటే మిన్నగా పెట్టుబడి రాయితీని అందిస్తున్న ఏకైక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి కేంద్రానికో లెక్క, రాష్ట్రానికో లెక్క అంటూ విషం కక్కడం ఈనాడుకే చెల్లింది.  

రూ.5,942 కోట్లు ఎగ్గొట్టిన బాబు.. 
రెయిన్‌ గన్లతో హంగామా చేసి రూ.కోట్లు దండుకుని వర్షాలు నేనే కురిపించా.. కరువును నేనే జయించా.. అంటూ ప్రచారార్భాటానికి ఒడిగట్టిన చంద్రబాబు హయాంలో రైతులకు రూ.5,942 కోట్లు ఎగ్గొట్టగా.. అందులో 24.80 లక్షల మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2,558.07 కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా రామోజీ? కానీ, ఈ నాలుగున్నరేళ్లలో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించడమే కాదు.. 54.50 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం అందించిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదే. అయినా.. బాబు మత్తులో ఉన్న రామోజీ తీరు కుక్క తోక వంకరలాంటిదే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement