సజ్జలతో మాట్లాడుతున్న పురుషోత్తమరెడ్డి
తిరుపతి ఎడ్యుకేషన్: రాయలసీమ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి కోరారు. తిరుపతికి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని సోమవారం ఆయన కలిశారు. సీమ నీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని సహజ న్యాయ సూత్రాలకు లోబడి విశాఖలో కాకుండా రాయలసీమలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు.
శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం పూడిక వల్ల 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. వరదల సమయంలో నీటిని సరఫరా చేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు తీగల వంతెన స్థానంలో సిద్ధేశ్వరం అలుగు చేపట్టేలా కేంద్రంతో సంప్రదింపులు చేయాలని కోరారు. పోతిరెడ్డిపాడు వెడల్పు, కాల్వల సామర్థ్యం పెంపు వంటి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
కుందూ నదిపై ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకెళతానని సజ్జల హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment