ప్రభుత్వం ఏం చేయాలో కోర్టులెలా చెబుతాయి? | Satyanarayana Prasad Reported To AP High Court On behalf Of Police | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఏం చేయాలో కోర్టులెలా చెబుతాయి?

Published Sat, Nov 21 2020 3:04 AM | Last Updated on Sat, Nov 21 2020 3:56 AM

Satyanarayana Prasad Reported To AP High Court On behalf Of Police - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో న్యాయస్థానాలు నిర్దేశించజాలవని పోలీసుల తరఫు సీనియర్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ సర్వా సత్యనారాయణ ప్రసాద్‌ హైకోర్టుకు నివేదించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పరిస్థితులను బట్టి పోలీసులు పలు నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని, ఇందులో న్యాయస్థానాలు ఏ రకంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. ఇటీవల న్యాయస్థానాలు తమ పరిమితులను మర్చిపోతున్నాయని, రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాల జోక్యానికి ఏమాత్రం ఆస్కారం లేదన్నారు. ప్రజలకు ఏది మంచో, ఏది చెడో నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే కానీ న్యాయస్థానాలు ఎంతమాత్రం కాదన్నారు. తమ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్‌ను ప్రయోగిస్తున్నారని, తమకు పోటీగా ఎవరూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా అడ్డుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ, గతంలో విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ టీడీపీ నేత తెనాలి శ్రవణ్‌కుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. వేర్వేరు అంశాలకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు చేస్తూ పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. 

ధర్మాసనం ముందున్న అంశంపై వ్యాఖ్యలు సమంజసం కాదు.. 
రాజధాని ప్రస్తుతం ఉన్న చోట కడితే రూ.100 కోట్లు నష్టం వాటిల్లవచ్చునని, మరోచోటకు మారిస్తే ఆ నష్టం రూ.10 కోట్లకే పరిమితం కావచ్చునని, అందువల్ల ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ఈ సందర్భంగా పోలీసుల తరఫు సీనియర్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ సర్వా సత్యనారాయణ ప్రసాద్‌ నివేదించారు. ఇందులో జోక్యం చేసుకునే పరిధి న్యాయస్థానాలకు లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరుగుతోందని, అందువల్ల ఈ అంశంపై మీతో (జస్టిస్‌ రాకేశ్‌) పాటు నేను కూడా మాట్లాడటం సమంజసం కాదని సత్యనారాయణప్రసాద్‌ వివరించారు. ఆ త్రిసభ్య ధర్మాసనంలో మీరు (జస్టిస్‌ రాకేశ్‌) సభ్యులు కారని, అలాగే ఆ కేసులో తాను న్యాయవాదినీ కాదని, అందువల్ల రాజధాని విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉంటే సమంజసంగా ఉంటుందని ఆయన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌కు స్పష్టం చేశారు.   

గుక్కెడు నీళ్లూ కరువే.. 
‘మీరు (జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌) బయట రాష్ట్రం నుంచి వచ్చారు. ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏమిటో మీకు అంతగా తెలియకపోవచ్చు. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేసిన నాటి నుంచి మేం (న్యాయవాదులు) పలు ఇబ్బందులు పడుతున్నాం. హైకోర్టుకు వస్తుంటే ఎడారి ప్రాంతానికి వెళ్లినట్లు ఉంటోంది. ఎక్కడో అడవిలో తెచ్చి హైకోర్టు కట్టారు. ఇక్కడ తాగటానికి నీళ్లు ఉండవు.. టీ ఉండదు.. తినడానికి తిండి ఉండదు. ప్రతి రోజూ మేం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఏమీ దొరకని చోట హైకోర్టును ఎందుకు కట్టాల్సి వచ్చింది?’ అని సత్యనారాయణ ప్రసాద్‌ కోర్టుకు నివేదించారు. ఈ న్యాయస్థానంలో దాఖలయ్యేవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని, అన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలేనన్నారు.  

విచారణ అర్హత లేని వ్యాజ్యం.. 
ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తనకు కావాల్సినప్పుడు పోలీసుల మద్దతు కోరతారని, అవసరం లేకుంటే వారిని తప్పుబడుతుంటారని చెప్పారు. విశాఖపట్నంలో రాజకీయాలు చేయడానికి వచ్చిన చంద్రబాబును పోలీసులు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని వెనక్కి వెళ్లాలని కోరారని, దీనిపై ఆయన, ఆయన పార్టీ నేతలు రాద్ధాంతం చేశారన్నారు. దీనిపై ఆయన పార్టీ నేత ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని, పోలీసుల తీరుపై అభ్యంతరం ఉంటే చంద్రబాబే స్వయంగా హైకోర్టును ఆశ్రయించి ఉండవచ్చన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి ఎలాంటి విచారణార్హత లేదని కోర్టుకు నివేదించారు.  

గడువు కోరిన పిటిషనర్‌ న్యాయవాది 
పిటిషనర్‌ తెనాలి శ్రవణ్‌కుమార్‌ తరఫు న్యాయవాది ఎస్‌.ప్రణతి పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానాన్ని అప్‌లోడ్‌ చేసేందుకు గడువు కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై సోమవారం నుంచి వాదనలు వింటామని, అందుకు సిద్ధంగా ఉండాలని అటు పిటిషనర్లకు, ఇటు అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్, స్పెషల్‌ కౌన్సిల్‌ సత్యనారాయణ ప్రసాద్‌లకు ధర్మాసనం స్పష్టం చేసింది.  

కానిస్టేబుల్‌ తప్పు చేస్తే సీఎం, డీజీపీలకు ఎలా ఆపాదిస్తారు? 
పోలీసుల తరఫున సీనియర్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ ఎస్‌.సత్యనారాయణ ప్రసాద్‌ వాదనలను వినిపిస్తూ తాము తప్ప ఇతరులు నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని పిటిషనర్‌ కోరడం అర్థం లేని అభ్యర్థన అన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, ఈ విషయంలో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు. ఓ కానిస్టేబుల్‌ తప్పు చేస్తే సీఎంను, డీజీపీని తప్పుబడుతూ న్యాయస్థానాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. మానవ సహజంగా ఉద్రేకంలో ఓ కానిస్టేబుల్‌ తప్పు చేస్తే  సీఎంకు, డీజీపీకి ఆపాదించడం సబబు కాదన్నారు. పిటిషనర్‌ తన వ్యాజ్యంలో ప్రభుత్వ చర్యలను మతిలేని చర్యలుగా పేర్కొన్నారని, ఇలాంటి భాష ఉపయోగించడం ఎంత మాత్రం హర్షణీయం కాదని సత్యనారాయణ ప్రసాద్‌ తెలిపారు. 

చీకటిపడితే తిరగలేని చోట హైకోర్టు నిర్మాణం 
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వానివి మతిలేని పనులు కావంటారా? అంటూ ప్రశ్నించింది. అమరావతిలో పలు నిర్మాణాలను ఆపేశారని, దీనివల్ల ఎంతో ప్రజాధనం వృథా అవుతుందని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. దీనిపై సత్యనారాయణ ప్రసాద్‌ స్పందిస్తూ రాజధాని అంశం త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున దీనిపై మాట్లాడటం సబబు కాదన్నారు. చీకటి పడితే వెనక్కి వచ్చేందుకు భయపడే చోట హైకోర్టును నిర్మించారన్నారు. ఈ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గురించి, నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయడం గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పందిస్తూ నేరస్తులను ఎన్నికల నుంచి దూరం చేయాలంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి జైలుకెళితే జైల్లో ఉన్నంత కాలం ఆ వ్యక్తికి ఓటు హక్కు ఉండదని, కానీ అదే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కూడా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెబుతోందని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తెలిపారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement