లాగేసుకుంది టీడీపీ సర్కారే | TDP govt has diverted Rs 200 crore from medical university funds | Sakshi
Sakshi News home page

లాగేసుకుంది టీడీపీ సర్కారే

Published Sun, Dec 5 2021 3:43 AM | Last Updated on Sun, Dec 5 2021 3:43 AM

TDP govt has diverted Rs 200 crore from medical university funds - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ విభాగాల్లో మిగులు నిధులు దుర్వినియోగం కాకుండా, పారదర్శకంగా ఆర్థిక నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏపీఎస్‌ఎఫ్‌సీకి డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం మిగులు నిధులను డిపాజిట్‌ చేసింది. ఈ అంశంపై టీడీపీ, ఎల్లో మీడియా తీవ్ర రాద్ధాంతం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయం నిధులను ప్రభుత్వం లాగేసుకుందని దుష్ప్రచారానికి దిగాయి. వాస్తవంగా యూనివర్సిటీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది టీడీపీ ప్రభుత్వమే. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని బోధన ఆసుపత్రుల్లో వసతుల కల్పనకు యూనివర్సిటీ నిధుల నుంచి రూ. 167.70 కోట్లు మళ్లించారు. ఈ డబ్బును విశ్వవిద్యాలయానికి తిరిగి ఇవ్వలేదు. ఇదే తరహాలో పలు మార్లు మరికొన్ని నిధులను అప్పటి ప్రభుత్వం మళ్లించింది. టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ.200 కోట్ల మేర నిధులను లాగేసుకుంది. పైగా దీనికి వడ్డీ కూడా ఇవ్వలేదు. అయినా అప్పట్లో ఎల్లో మీడియా చూసీచూడనట్టు వదిలేసింది.

టీడీపీ ప్రభుత్వంలో నిధులు మళ్లిస్తూ ఇచ్చిన జీవో 

ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నా రాద్ధాంతం
యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ గత నెల 13వ తేదీన సమావేశమై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో మిగులు నిధులు డిపాజిట్‌ చేయాలని తీర్మానించింది. యూనివర్సిటీ నిధులు డిపాజిట్‌ చేసిన 5 బ్యాంకులు 5.1 శాతం వడ్డీ చెల్లించేవి. ఏపీఎస్‌ఎఫ్‌సీ 5.5 శాతం వడ్డీ చెల్లించడానికి ముందుకు వచ్చింది. అప్పటికే ఉన్న డిపాజిట్‌లకు వస్తున్న వడ్డీతో పోలిస్తే ఇది 0.40 శాతం ఎక్కువ. దీంతో గత నెల 30న రూ.400 కోట్ల మిగులు నిధులను యూనివర్సిటీ ఏపీఎస్‌ఎఫ్‌సీలో డిపాజిట్‌ చేసింది. ఎక్కువ వడ్డీ వస్తున్నప్పటికీ టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో ఎటువంటి ఆర్థిక లబ్ధీ చేకూర్చకుండా నిధులను లాగేసుకున్న టీడీపీ.. ఇప్పుడు ఎక్కువ వడ్డీ వస్తూ యూనివర్సిటీకి లబ్ధి చేకూరుతున్నప్పటికీ రాద్ధాంతం చేస్తుండటం అనైతికమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎక్కడా గోప్యత లేదు: వీసీ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌
విశ్వవిద్యాలయం నిధులను ఏపీఎస్‌ఎఫ్‌సీలో డిపాజిట్‌ చేయడంలో ఎక్కడా గోప్యత లేదు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగానే జరిగింది. యూనివర్సిటీకి అవసరం ఉన్నప్పుడు డిపాజిట్‌లు విత్‌డ్రా చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement