సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ‘‘రైతులకు మేలు జరగాలి. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు.
కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని సుబ్బరామ సోమయాజి అన్నారు. పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్ సన్మానించారు. తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు.. సీఎం జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
సీఎం జగన్ దంపతులకు మంత్రి ఆర్కే రోజా మెమెంటో అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు.
ఉద్యోగులు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. మండలంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment