సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్ష, కో– ఆప్షన్ సభ్యుల పదవులకు శుక్రవారం జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. ఏడు మండలాల్లో ఎంపీపీ పదవుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా చిత్తూరు జిల్లా రామకుప్పం మినహా మిగిలిన ఆరు మండలాల్లో పూర్తయ్యాయి.
ఆరుకి ఆరు ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. మరో 11 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించగా రామకుప్పం మినహా మిగిలిన 10 మండలాల్లో పూర్తయ్యాయి. పదిలో తొమ్మిది చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందగా ఒక్క చోట స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించారు. రామకుప్పం మండలంలో ఎంపీటీసీ సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు రెండూ వాయిదా పడినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఇక ఆరు మండలాల్లో కో– ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగగా ఐదు చోట్ల పూర్తయ్యాయి. ఐదు చోట్లా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులే కో – ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. చిత్తూరు మండలంలో కో– ఆప్షన్ సభ్యుడి పదవికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది.
దాచేపల్లి అధికార పార్టీదే
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ పదవికి శుక్రవారం నిర్వహించిన ఉప ఎన్నికలో 10వ వార్డు నుంచి గెలుపొందిన వైఎస్సార్‌సీపీ సభ్యురాలు కె.సుబ్బమ్మ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 29 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉప సర్పంచి ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం 25 పంచాయతీల్లో ఉప సర్పంచి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవగా సభ్యులు హాజరు కాని కారణంగా మూడు చోట్ల తిరిగి ప్రకటించే వరకు వాయిదా పడ్డాయి. ఒక్క చోట మాత్రం నిబంధనల ప్రకారం శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్థానిక ఎన్నికల అధికారి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment