![వైవీయూ ముఖద్వారం వద్ద ఉన్న వేమన విగ్రహం - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/19/18kdp401-170067_mr_1.jpg.webp?itok=9eYFipBH)
వైవీయూ ముఖద్వారం వద్ద ఉన్న వేమన విగ్రహం
యోగివేమనా నీకు వందనం.. విశ్వకవితాత్వికా నీకు వందనం.. అన్న ఉద్దీపన గీతంతో ఉత్తేజితులవుతూ.. సామాజిక స్పృహ కల్పించిన ప్రజాకవి పేరుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తూ రాగా.. రాష్ట్ర ప్రభుత్వం వేమన జయంతిని ప్రతియే టా జనవరి 19న రాష్ట్ర వేడుకగా
నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీచేసి సముచిత గౌరవం కల్పించింది.
వైవీయూ : విశ్వదాభిరామ.. వినురవేమ.. అనేమాట వినని తెలుగువారు ఉండరు.. ‘వానకు తడవని వారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరు’ అని లోకోక్తి. ఆ మహాకవికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని గత ఏడాది జీఓ నంబర్ 164ను విడుదల చేసింది. దీంతో ప్రతియేటా జనవరి 19న వేమన జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
ప్రజాకవి, తత్వవేత్త అయిన వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకై క విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయంలో 2014లో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కొద్ది సంవత్సరాల పాటు జనవరి 18వ తేదీన వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జనవరి 19న రాష్ట్రవేడుకగా వేమన జయంతిని నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అతిథులకు సైతం వేమన పద్యాలను జ్ఞాపికల రూపంలో అందజేస్తూ సరికొత్త సంప్రదాయానికి విశ్వవిద్యాలయ అధికారులు శ్రీకారం చుట్టారు.
ప్రాంగణంలో వేమన పద్యాలు..
వేమన పద్యాలు ఎంత సరళంగా స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయో.. ఆ పద్యాలకు ఉన్న ఆదరణే తెలియజేస్తుంది. అయితే వేమన పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆయన నోటి నుంచి జాలువారిన పద్యాలను ఎంపిక చేసుకుని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయంలో ‘వేమన మాట’ పేరుతో వేమన పద్యాలను రాసి క్యాంపస్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అదే విధంగా ముఖ్య అధికారుల కార్యాలయాల్లో సైతం వేమన పద్యాలను ఏర్పాటు చేశారు.
నేడు వైవీయూలో వేమన జయంతి ఉత్సవం
యోగివేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం వేమన జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగుశాఖ విభాగాధిపతి ఆచార్య బి. పార్వతి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ఆచార్య తప్పెట రామప్రసాద్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. వైవీయూ పరిపాలన భవనం నుంచి వేమన చైతన్య ర్యాలీ, పద్యగానం కార్యక్రమాలు, వేమన విగ్రహానికి పుష్పమాల అలంకరణ ఉంటాయని తెలిపారు.
నేడు యోగి వేమన జయంతి వేడుకలు
వేమన చైతన్యర్యాలీ, పద్యగానం
Comments
Please login to add a commentAdd a comment