![పేదరికం నిర్మూలనకు పటిష్ట కార్యాచరణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/collectorrr_mr-1738872214-0.jpg.webp?itok=XjsVdGE0)
పేదరికం నిర్మూలనకు పటిష్ట కార్యాచరణ
రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సున్నా పేదరికం – పి 4 పాలసీకి అనుగుణంగా నియోజకవర్గస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం విజయవాడ నుంచి సున్నా పేదరికం – పి4 విధానం,నియోజకవర్గ అభివృద్ధి విజన్ ప్రణాళికల తయారీ, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఎంఎస్‌ఎంఈ సర్వే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి4 పాలసీ రూపొందించడానికి తీసుకోవాల్సిన అంశాలు, జిల్లాలో చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సమావేశంలో పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. అలాగే జిల్లాలలో జరుగుతున్న ఎంఎస్‌ఎంఈ సర్వే ప్రగతిపై సమీక్షించారు. 86 శాతంతో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడంపై అభినందించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పేదరికం నిర్మూలనకు ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం ప్రతి మండలంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
Comments
Please login to add a commentAdd a comment