![చక్రస్నానం.. సర్వపాపహరణం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06kdp201a-603002_mr-1738872213-0.jpg.webp?itok=mlfYvflV)
చక్రస్నానం.. సర్వపాపహరణం
కడప కల్చరల్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం స్వామి, అమ్మవార్లకు అవభృథ స్నానం, సుదర్శన చక్రత్తాళ్వార్‌కు తీర్థస్నానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి మేళతాళాలతో ప్రత్యేక పల్లకీలో స్వామి, అమ్మవార్లతోపాటు శ్రీ చక్రాన్ని ఊరేగింపుగా పుష్కరిణి మండపానికి చేర్చారు. అక్కడ రెండున్నర గంటలపాటు వేద మంత్ర యుక్తంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతం,ఇతర ద్రవ్యాలతో అభిషేకించారు. వేద పండితుల మంత్రోచ్ఛాటనల మధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత చందన లేపనం, నారికేళ జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల బృందం పాలు, పెరుగు, తేనె, శుద్ధ జలాలతో కూడా ప్రత్యేకంగా అభిషేకం చేశారు. వట్టివేర్లతో ప్రత్యేకంగా దండలను స్వామి, అమ్మవార్లకు అలంకరించడం విశేషం. అనంతరం ఉత్సవమూర్తులను చక్రత్తాళ్వార్‌తోపాటు పుష్కరిణిలోకి తీసుకెళ్లారు. గోవిందనామ స్మరణలు, భక్తుల కోలాహలం మధ్య మూలమూర్తులతోసహా అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేశారు. భక్తులు తాము కూడా పుష్కరిణిలో మునకలు వేసి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. స్వామి ప్రత్యేక ప్రసాదంగా ఉత్సవ మూర్తులకు లేపనం చేసిన సుగంధం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాత్రి వేద మంత్రోచ్ఛాటనల మధ్య ఆలయ ప్రాంగణంలో గరుడ పతాకాన్ని ధ్వజావరోహణం చేశారు. దీంతో కడప రాయుని బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
నేడు పుష్పయాగం: బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్బంగా శుక్రవారం స్వామి, అమ్మవార్లకు పుష్ప యాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం చేయనున్నారు. సాయంత్రం 6 నుంచి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్యుల కీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి సన్నిధిలో పుష్పయాగం నిర్వహించనున్నారు.
వైభవంగా ధ్వజావరోహణం
Comments
Please login to add a commentAdd a comment