రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ
గుర్రంకొండ : రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో గుర్రంకొండ తెలుగు జెడ్పీహైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. అండర్–17 ఫెన్సింగ్ పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టులో పాల్గొన్న కె.ప్రసన్నకుమార్ కాంస్య పతకం సాధించారు. అండర్–14 పోటీల్లో హరినాథ్, ముజాహిద్ కాంస్య పతకాలు సాధించారు. మంగళవారం జరిగిన అభినందన సభలో హెడ్మాస్టర్ అహ్మద్‌బాషా, పీడీ చింతిర్ల రమేష్, తదితరులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. రవీంద్ర, హర్షవర్ధన్‌రెడ్డి, త్రినాథ్, రెడ్డిమోహన్, మదన్‌మోహన్, ఉషారాణి, ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిపై రాయితో దాడి
మదనపల్లె : వ్యక్తిపై రాయితో దాడి చేసిన సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు...నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ బండపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి (54) ఇంటి సమీపంలో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డు వేసేందుకు దారి స్థలాన్ని చదును చేస్తుండగా శ్రీనివాసులురెడ్డి అక్కడే ఉన్నాడు. చదువు చేసిన మట్టి పక్కనున్న సిద్దల చిన్నపరెడ్డి స్థలంలో పడటంతో, అప్పటికే రోడ్డు నిర్మాణంపై వ్యతిరేకతతో ఉన్న చిన్నపరెడ్డి ఆవేశానికి లోనై రాయితో శ్రీనివాసులురెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో శ్రీనివాసులురెడ్డి తలకు తీవ్రంగా గాయం కాగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
స్నేహితుడిని కలవడానికి వచ్చి మృత్యు ఒడిలోకి...!!
కురబలకోట : మూర్ఛ వ్యాధి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీసింది. అనంతపురం పట్టణానికి చెందిన హరి (21)మంగళవారం అంగళ్లులో ఆకస్మికంగా మృతి చెందినట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. అంగళ్లులో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న స్నేహితుడిని కలవడానికి మంగళవారం వచ్చాడు. అనంతరం అతను అంగళ్లులో బస్టాపు వద్ద నిలబడి ఉండగా మూర్చ (ఫిట్స్) వచ్చింది. ఒక్కసారిగా కుప్ప కూలాడు. హుటా హుటిన అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబీకులు శోకతప్తులయ్యారు.
విద్యార్థులు
చదువులో రాణించాలి
రాయచోటి : పోలీసుల పిల్లలు, విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభిప్రాయపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎస్పీ ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందజేశారు. రాయచోటిలోని పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment