మత్తుకు బానిసలు కావద్దు
రాయచోటి : ఉన్నత భవిష్యత్తు కల్గిన యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 20 కిలోల గంజాయితో పట్టుబడిన నిందితుడితో ఎస్పీ మంగళవారం వీడియో సమావేశం నిర్వహించారు. పీలేరులో ఐదు రోజుల క్రిందట ఇంటర్ చదివే ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఉండి రైలు క్రిందపడి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని గంజాయి విక్రయదారులపై ప్రత్యేక పోలీసు బృందంతో దాడులు నిర్వహించామన్నారు. చనిపోయిన యువకులు వాడిన గంజాయి ఎక్కడెక్కడ లభించిందనే విషయంపై ఆరా తీశామన్నారు. కొందరు గ్యాంగ్‌గా ఏర్పడి స్థానికంగా గంజాయి అమ్ముతున్న వివరాల ఆధారంగా షేక్ మహబూబ్ బాషా(45)ను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించగా 20 కిలోల గంజాయి దొరికిందన్నారు. మహబూబ్ బాషా 20 మందికి పైగా పీలేరు టౌన్‌లో యువతకు గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరు విద్యార్థులు గంజాయిని పీల్చి చనిపోవడానికి అతడు కారణమయ్యారన్నారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ వివరించారు. త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, పీలేరు సిఐ యుగంధర్‌లు పాల్గొన్నారు.
బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు
సంబేపల్లె : మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన బాలాజీ ద్విచక్ర వాహనంలో దేవపట్ల నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. వడ్డిపల్లె క్రాస్ సమీపంలోకి రాగానే రాయచోటి నుంచి ద్విచక్ర వాహనంలో జావెద్ వస్తున్నారు. ఇరువురూ చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై రెడ్డివారిపల్లె సమీపంలో పరస్పరం ఢీకొన్నారు. ప్రమాదంలో ఇరువురికీ గాయాలవడంతో 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment