సనాతన ధర్మం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
రాయచోటి అర్బన్ : సనాతన ధర్మం పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొన్ని పార్టీలు వివాదాలకు తెరతీస్తున్నాయని పలు సంఘాల నేతలు, వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి పట్టణంలోని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) కార్యాలయంలో సమాజానికి ఏది అవసరం? సనాతన ధర్మమా? లౌకికవాద రాజ్యాంగమా? అంశంపై మంగళవారం చర్చాగోష్టి జరిగింది. డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి మండెం సుధీర్ కుమార్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ పేరిట వివాదాలను రేకెత్తించి, రాజకీయలబ్ధి పొందాలనుకునే నాయకులకు తగు రీతిలో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలో సనాతన ధర్మం ప్రస్తావన లేదని, లౌకిక వాదంతో సమానత్వాన్ని మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు ఉద్భోదించారని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ సనాతన ధర్మానికి వక్రబాష్యం చెబుతూ హిందూ మతాన్ని కొన్ని పార్టీల నాయకులు అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని, అధికారాన్ని అనుభవించడానికి హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఆక్షేపనీయం అన్నారు. ప్రజల్లో కుల, మత విభజనకు చేస్తున్న కుట్రలను ఐక్యంగా ప్రతిఘటించాలంటూ పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉపన్యసించడం దురదృష్టకరం అన్నారు. మణిపూర్ ఘర్షణల్లో మహిళను నగ్నంగా ఊరేగించిన రోజున పవన్‌కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు హరికుమార్, భారతీయ అంబేడ్కర్ సేన రాష్ట్ర కార్యదర్శి పల్లం తాతయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సాంబశివ, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపు క్రిష్ణప్ప, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథనాయక్, పౌరహక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రవిశంకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, కదిరయ్య, రామాంజనేయులు, రంగారెడ్డి, సుమిత్రమ్మ, కోటి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment