ఇరు వర్గాల మధ్య భూ వివాదం
గాలివీడు : భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటన మంగళవారం గాలివీడులో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని గేట్ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఇటీవల రహదారి విస్తరణకు అక్రమ నిర్మాణాలు తొలగించారు. అనంతరం సర్వే నెంబర్–2266లో 1.50 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి అప్పగించింది. ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి విస్తరణ పనులు జరుగుతుండగా, స్థానికులు కొందరు ఆర్‌అండ్‌బీ స్థలం ఆక్రమించి రేకుల షెడ్లు ఏర్పాటుచేశారు. ఆ రేకుల షెడ్ల వెనుక భాగం తమ ఆనుభవంలో ఉందని కొందరు ముస్లింలు కొంత స్థలం చుట్టూ రేకులువేశారు. ఇదిలా ఉంటే అది తమ పట్టా భూమి అంటూ ఇంకో వర్గం వారు రేకులను తొలగించారు. అన్ని వర్గాల వారు మంగళవారం ఒక చోట చేరి వివాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నాయకుల అండతో తమ పట్టా భూమిలో షెడ్లు వేశారని భూ యజమాని, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దారు భాగ్యలత వివరణ కోరగా ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగిస్తామని, హద్దులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటసుబ్బయ్య వివరణ ఇస్తూ ఆక్రమణలో ఉన్న రేకుల షెడ్లను స్వచ్ఛందంగా తొలగించాలని తెలిపారు. నాలుగురోడ్ల కూడలిలోని సర్వే నెంబర్ 2266లో ఆర్‌అండ్‌బీ స్థలంలో సర్వే చేశామని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ స్థలం ఆక్రమణకు గురైందో గుర్తించి స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment