ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
గుర్రంకొండ : గుర్రంకొండ సమీపంలోని శ్రీవోనీ ఆంజనేయస్వామి ఆలయంలో దుండగులు చొరబడి స్వామికి అలంకరించిన ప్రభవలను ధ్వంసం చేశారు. లక్ష రూపాయల విలువ చేసే వస్తువులను దోచుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి సమీపంలోని గుర్రంకొండ–సంగసముద్రం మార్గంలో పురాతన వోనీ ఆంజనేయస్వామి ఉంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి ఆలయం గేట్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామికి అలంకరించిన ప్రభవను రాడ్లతో ధ్వంసం చేశారు. గంట, హారతి, ఇతర పూజా సామగ్రి, వస్తువులు బయటికి తెచ్చి ధ్వంసం చేశారు. కార్యాలయ గది తాళాలు పగలగొట్టి.. అందులోని బీరువాలో ఉన్న రూ.20 వేల నగదు దోచుకెళ్లారు. ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే వ్యవసాయం చేసుకొంటున్న రైతులు ఆలయంలో అలికిడి విని కేకలు వేయగా దుండుగులు ఆ వస్తువులు పడేసి పరారయ్యారు. గత పది రోజుల్లోనే రెండు ఆంజనేయస్వామి ఆలయాలను దుండుగులు ధ్వంసం చేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ మధురామచంద్రుడు, సిబ్బంది చేరుకుని చోరీ జరిగిన ప్రాంతం, ధ్వంసమైన వస్తువులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment