గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
మదనపల్లె : పట్టణంలోని మోతీ నగర్‌లో బుధవారం సాయంత్రం గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. స్థానికుల వివరాల మేరకు.. మోతీనగర్‌లో నివాసమున్న సురేష్ ఇంటిలో గ్యాస్ లీకేజీ కావడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంటలతోపాటు ఇళ్లంతా పొగలు నిండిపోవడంతో యజమాని అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. ఫైర్ ఆఫీసర్ శివప్ప చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటిలో పొగను పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన క్రిష్ణమ్మ(55)ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదంలో రూ.5లక్షల నష్టం వాటిల్లగా, మరో రూ.8 లక్షల ఆస్తిని అగ్నిమాపక అధికారులు కాపాడినట్లు యజమాని సురేష్ తెలిపారు. అనంతరం స్థానికులకు గ్యాస్ వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
సారా ఊట ధ్వంసం
మదనపల్లె : మండలంలోని నారమాకులతండా గ్రామంలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తయారీకి సిద్ధంగా ఉంచిన వేయి లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. అనంతరం ఎస్‌ఐ చంద్రమోహన్, గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సారా తయారీ, విక్రయించడం, రవాణా చేయడం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పిచ్చిగుంట్లపల్లెలో ఘర్షణ
వీరబల్లి : చెత్త దిబ్బ విషయంలో ఇరు వర్గాల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. మండలంలోని తాడిగుంటపల్లి పంచాయతీ పిచ్చిగుంటపల్లిలో తాటిగుంటపల్లి మాజీ సర్పంచి రామచంద్రారెడ్డి వెళ్తుండగా అదేగ్రామానికి చెందిన ముద్రగడ ఈశ్వరమ్మ, పార్వతి చెత్త దిబ్బ విషయమై తమ గోడు విన్నవించారు. దీంతో అదే గ్రామానికి చెందిన రామచంద్ర కుమారులు సంజీవ, నాగేంద్ర, రెడ్డమ్మ, బయ్యమ్మ అనే నలుగురు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఈశ్వరమ్మ, పార్వతిలకు గాయాలయ్యాయి. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment