పంటనూర్పిడి బండ ఆక్రమణను అడ్డుకున్న గ్రామస్తులు
మదనపల్లె : రైతులు పంట ఉత్పత్తులను నూర్పిడి చేసుకునేందుకు, ఎండబెట్టుకునేందుకు చాలాకాలంగా వినియోగిస్తున్న బండను, అక్రమార్కులు చదునుచేసేందుకు ప్రయత్నిస్తే గ్రామస్తులు అడ్డుకున్న ఘటన మంగళవారం మండలంలో జరిగింది. పోతబోలు పంచాయతీ మదనపల్లె–తిరుపతి హైవేకు ఆనుకుని, గాండ్లపల్లెకు వెళ్లే దారిలో సర్వేనెంబర్లు.141–బి/1, ఇతర నెంబర్లలో దాదాపు 3 ఎకరాలకు పైగా బండ ఉంది. దీనిని సమీప గ్రామస్తులు పంట ఉత్పత్తులు నూర్పిడికి, కొటారు బండగా వినియోగిస్తున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ఈ బండను ఓ మిలిటరీ సైనికుడికి ప్రభుత్వం పట్టా కింద మంజూరుచేస్తే...గ్రామస్తులు అందరూ నిరసన తెలపడంతో, అప్పటి కలెక్టర్ విచారణ చేసి వ్యవసాయ యోగ్యం లేని బండను, గుట్టను కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అప్పట్లో మీడియాలో వార్తలు ప్రచురితం కావడంతో, బండ కేటాయింపును రద్దు చేయాలని పట్టాదారుడు రెవెన్యూశాఖకు అర్జీ పెట్టుకోవడంతో రద్దు చేశారు. తర్వాత ఇది ప్రభుత్వస్థలంగానే పరిగణించడం జరుగుతోంది. అయితే ఇటీవల ఈ బండకు ఆనుకుని, తిరుపతి–మదనపల్లె నేషనల్ హైవే వెళ్లడం, బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.12కోట్లకు పైగా విలువ చేస్తుండటంతో దీనిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కొందరు పావులు కదపడం ప్రారంభించారు. అధికార పార్టీ నాయకులను మచ్చిక చేసుకుని, తమకు అనుకూలమైన రెవెన్యూ అధికారుల సహకారంతో రద్దు అయిన భూమికి, పాత పత్రాలను చూపిస్తూ, చదును చేసేందుకు ప్రయత్నించారు. ఈ స్థలం వెనుకకు సర్వేనెం.141–2–6లో గాండ్లపల్లెకు చెందిన బుడ్డక్క లక్ష్మన్న, ఈశ్వరయ్యలు రెండు ఎకరాల్లో అల్లనేరేడు చెట్లు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ బండను అక్రమార్కులు చదును చేస్తుండటంతో తన పొలానికి దారి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విలువైన ప్రభుత్వస్థలాన్ని దొడ్డిదారిలో కాజేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తుంటే, అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సహకారం అందించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండ ఆక్రమణపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
పొలానికి దారి లేకుండా
చేయడంపై ఆగ్రహం
రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోని వైనం
అధికార పార్టీ అండతో రూ.12 కోట్ల భూమి కాజేసేందుకు యత్నం
Comments
Please login to add a commentAdd a comment