శ్రీ వీరభద్రస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఆలయంలోని వినాయకుడు, శ్రీ అఘోరలింగేశ్వరుడు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయాలకు చెందిన హుండీ ఆదాయాలను లెక్కించారు. 171 రోజులకు సంబంధించి స్వామి వారికి రూ.45,23,541 ఆదాయం వచ్చింది. 47 గ్రాముల బంగారం, 4.3 కిలలో వెండి ఆభరణాలు కూడా వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు. ఈ మొత్తాన్ని కెనెరా బ్యాంక్‌లో జమ చేశారు.కార్యక్రమంలో దేవదాయశాఖ ప్రత్యేక అధికారి ఎం. రవికుమార్, ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
అధ్యాపకుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడిగా రాఘవరెడ్డి
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం(జీసీటీఏ ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా పట్టణంలోని బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్.మలిగి రాఘవరెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్ కళాశాల వేదికగా ఆదివారం జరిగిన 37వ జీసీటీఏ ఏపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం అనంతరం జరిగిన కేంద్రస్థాయి ఎన్నికల్లో 201–30 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థిపై రాఘవరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు రాఘవరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.జి.ఆనందరెడ్డి, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్.జి.శ్రీదేవి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి ఫొటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల పాటు ఇచ్చే శిక్షణకు 18–45 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువకులకు ప్రాధాన్యత ఇస్తారని, దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు : 94409 05478, 99856 06866లలో సంప్రదించాలని వివరించారు.
19 నుంచి క్రీడా పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక కొర్రపాడు రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 19 నుంచి 21 వరకు కడప రీజనల్ స్థాయి 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ బాలుర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జింకా అశోక్‌బాబు తెలిపారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 384 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరికి చెస్, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, 100 మీ, 200 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, 100 మీటర్లు, 4 రిలే, హైజంప్, లాంగ్‌జంప్, బ్రాడ్‌జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment