అతివలలో అనాసక్తి!
సాక్షి రాయచోటి: కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి పరిశ్రమలు...ఆహార ఉత్పత్తి కేంద్రాలవైపు అడుగులు వేస్తున్నా మహిళల నుంచి ఆసక్తి కనబడటం లేదు. ప్రధానంగా స్వయం సహాయక సంఘ గ్రూపులైతే 10 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ప్రజలకు కూడా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తారన్న సంకల్పంతో ప్రధానమంత్రి ఫార్మేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్‌ఎంఈ) కింద సబ్సిడీ రుణాలు అందిస్తున్నారు. అయితే గ్రామీణ స్థాయిలో ప్రజలే కాకుండా అతివలు కూడా ఆసక్తి చూపడం లేదు. ఆహార పరిశ్రమలకు సంబంఽధించి మార్కెటింగ్‌తోపాటు ఇతర కొనుగోలు సమస్యలు కూడా ఏర్పడతాయన్న ఆలోచనే దీనికి కారణం. ఇప్పటికే సెర్ఫ్ నుంచి ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆసక్తిగల వారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకు వస్తే సబ్సిడీ రుణాల ద్వారా సహకారం అందిస్తామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లాలో సుమారు 30,685 ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉండగా, 300671 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే డీఆర్‌డీఏ ద్వారా ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పాలన్న ఆసక్తి ఉన్న వారు ముందుకు వస్తే అందుకు సబ్సిడీతో రుణాలు ఇప్పించేందుకు సంస్థ ముందుకు వస్తుందని అధికారులకు వివరిస్తున్నారు. అతివలు మహిళా సాధికారత సాధించి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉన్నప్పటికీ చాలామంది ముందుకు రావడం లేదు. జిల్లాకు సంబంధించి సుమారు 150 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే చాలామంది మహిళల్లో రుణాలతోపాటు పరిశ్రమల ఏర్పాటుతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్న ఆందోళన వెంటాడుతోంది.
స్వయం ఉపాధికి ప్రత్యేక శిక్షణ
అన్నమయ్య జిల్లాలోని కలికిరిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే సుమారు 1250 మందికి పైగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇచ్చారు. ఆసక్తిగల వారిని ప్రత్యేకంగా శిక్షణతో తీర్చిదిద్దుతున్నారు. ఉపాధి బాట పట్టాలనుకున్న వారికి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. శిక్షణ ద్వారా కూడా తెలుసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
చిరుధాన్యాల యూనిట్లతో ప్రయోజనం
ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరిగింది. రాగులు, జొన్నలు, కొర్రలు, సొద్దలు, అరికెలు, సామెలు తదితరాలతో ఆహార ఉత్పత్తి పరిశ్రమలకు డీఆర్‌డీఏ ప్రాధాన్యనిస్తోంది. అయితే ఈ చిరుధాన్యాల ఉత్పత్తులు తినడం ద్వారా మనిషికి పౌష్టికాహారంగా ఉపయోగపడడంతోపాటు చాలా ప్రయోజనాలుఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళల ద్వారా అటువైపు ప్రోత్సహిస్తే వారు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని గ్రామీణాభివృద్ధిశాఖ భావిస్తోంది.
స్వయం సహాయక సభ్యులతోపాటు ఆసక్తిగల వారికి యూనిట్లు
ముందుకు రాని మహిళలు
Comments
Please login to add a commentAdd a comment