టీడీపీ యువ నాయకుడు ఆకస్మిక మృతి
కురబలకోట : మండల టీడీపీ నాయకుడు కొండతూర్పు ప్రాంతంలోని శిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన అశోక్‌కుమార్ (30) సోమవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందాడు. ఇతను ఇంటి వద్ద ఉండగా అస్వస్థత స్థితిలో కడుపు నొప్పిగా ఉంది..మజ్జిగ కావాలని తల్లి రెడ్డెమ్మను అడిగాడు. ఆమె ఇచ్చిన కొంత సేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తల్లి ఇరుగు పొరుగును పిలిచి విషయం చెప్పగా వారు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇతను గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కనసానివారిపల్లె సర్పంచ్ అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయాడు. నాలుగేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. దీనికి తోడు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు, చెయ్యి దెబ్బతింది. ఇటీవల ఇతనికి రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం చంద్రబాబును కూడా కలిశాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇతను ఆకస్మికంగా మృతి చెందడానికి కారణం ఏమిటన్నది అంతుబట్టడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. పురుగుల మందు తాగాడా.. లేదా కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment