సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటి: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, కలెక్టరేట్ ఎస్‌డీసీ రామసుబ్బయ్యలు పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల నుంచి అందిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన అర్జీలోని అంశంపై దృష్టి పెట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు రీ–ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. అలాగే రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
కోర్టు కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రభుత్వ శాఖలలో కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ ఫైల్ చేయాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఇటీవల హైకోర్టు ఆదేశించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కోర్టు కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కనీసం 15 రోజులు ముందుగానే కౌంటర్‌ను సిద్ధ చేయాలని, నిర్ణీత కాల వ్యవధిలో కౌంటర్ పైల్ చేయని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా, మండలస్థాయి అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment