●చోద్యం చూస్తున్న అధికారులు
ఇసుక అక్రమరవాణాను ఆరికట్టి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తూ కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో కొద్దిరోజుల పాటు స్థానిక రెవెన్యూ అధికారులు చెరువుల వద్ద హాడావిడి చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టామంటూ ప్రచారం చేసుకున్నారు. పోలీసులు రెండు రోజుల పాటు చెరువుల వద్ద కాపాలాగా ఉన్నారు. అయినా ఫలితం లేదు. అక్రమ రవాణా ఆగడం లేదు. దీంతో అధికారులు చెరువులవైపు వెళ్లడం మానేశారని రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గుర్రంకొండ: ఇసుకాసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పగలంతా చెరువు పరిసర పొలాల్లో ఇసుకను లోడింగ్ చేసి రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగు తున్నా ఆధికారులు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
● గుర్రంకొండ మండలంలోని తరిగొండ, మర్రిపాడు గ్రామాల్లోని రామానాయిని చెరువు, హరిహరాదుల చెరువు అతిపెద్ద ఇరిగేషన్ చెరువులు. వందలాది ఎకరాల్లో ఈరెండు విస్తరించి ఉన్నాయి. చెరువుల్లో ఇసుక నిల్వలు భారీగా ఉండడంతో ఇసుకాసురుల కళ్లు వీటిపై పడ్డాయి. రోజుల తరబడి జేసీబీలతో చెరువుల్లోని ఇసుకను తోడేస్తున్నారు. ఒక జేసీబీ.. నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని ఇసుకను తోలేస్తున్నారు. చెరువుల్లో ముందుగా పైన మట్టిని జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నారు. తవ్వేసిన మట్టిన ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి ఇటుక బట్డీలకు విక్రయిస్తున్నారు.తరువాత టన్నుల కొద్దీ ఇసుక నిల్వలు బయటపడుతున్నాయి. పట్టపగలే జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తోలేస్తున్నారు.
● ఇసుక తరలింపులో ఇసుకాసురులు కొత్త మార్గానికి శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా ఇసుకను భారీ ఎత్తున డంపింగ్ చేస్తున్నారు. పగలంతా చెరువుల్లోని ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి చెరువు పరిసరాల్లోని పొలాల వద్ద డంపింగ్ చేస్తున్నారు. రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా వాహనాల ద్వారా బయట ప్రాంతాలకు తరలించేస్తున్నారు. మండలంలోని రామానాయిని చెరువుకు సమీపంలోని రుద్రావాండ్లపల్లె, పిల్లగోవులపల్లె, రేగడపల్లె, కొత్తపల్లె, మర్రిపాడు పరిసర గ్రామాల్లో ఇసుక డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పదిలోడ్ల నుంచి పదిహేను లోడ్ల వరకు ఇసుక డంపింగ్ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడక్కడా ఇసుక డంపిగ్‌లు ఉంచి రాత్రిళ్లు జేసీబీల సాయంతో ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు.
పక్క మండలాలకు తరులుత్నున ఇసుక
మండలంలోని మర్రిపాడు, తరిగొండ, అమిలేపల్లె, శెట్టివారిపల్లె, బోడిగుట్ట సమీప చెరువుల్లో ఇసుక దోపిడీ యథేచ్చగా సాగుతోంది. కొంతమంది వ్యక్తులు చెరువులను ఆక్రమించేశారు. వీటిలో చేరిన టన్నుల కొద్దీ ఇసుకను బహిరంగంగా టిప్పర్లు,ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. పక్కనే ఉన్న వాల్మికీపురం, కురుబలకోట, పెద్దమండ్యం మండలాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకొంటున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుకను బయట ప్రాంతాల్లో రూ. 3వేలు నుంచి రూ.3300వరకు విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం ఇసుకను చెప్పుకొంటూ రాత్రిళ్లు బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇంటినిర్మాణాలు, ప్రభుత్వపనుల సాకుతో..
ఇంటినిర్మాణాలు, ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన అభివృద్ధి పనుల నిర్మాణాల కోసం అనే సాకుతో ఇసుకాసురులు ఇసుకను విక్రయిస్తున్నారు. మండలంలో సీసీరోడ్లు, ఢ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిని సాకుగా చూపించి రోజుల తరబడి ఇసుకను చెరువుల్లో అక్రంగా తోడేస్తూ కొంతమంది లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకొంటున్నారు. గృహ అవసరాల కోసం ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించేందకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే జేసీబీలతో తోడేయమని ఎక్కడా అనుమతి ఇవ్వలేదు. అయినా ఇవేవీ తమకు పట్టవంటూ కొంతమంది నేతలు ఇసును జేసీబీలతో రాత్రిబంవళ్లు తోడేస్తున్నారు. ఇసుక విషయమై అధికార పార్టీకి చెందిన ఓ వర్గం నేతలు ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. స్వయంగా అధికార పార్టీ నేతలే అధికారులకు ఫిర్యాదు చేసే స్థాయికి వచ్చారంటే ఏ స్థాయిలొ ఇసుక అక్రమరవాణా జరుగుతుందో తేటతెల్లమవుతోంది.
రెచ్చిపోతున్న ఇసుకాసురులు
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
తూతూ మంత్రంగా చర్యలు
బందోబస్తు ఏర్పాటు చేస్తాం
రామానాయిని చెరువు, హరిహరాదుల చెరువుల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. గతంలో కొద్దిరోజుల పాటు చెరువుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇకమీదట ఇసుక అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేసి చట్టపరంగా చర్యలు చేపడతాం. –మధురామచంద్రుడు, ఎస్‌ఐ, గుర్రంకొండ
చర్యలు తీసుకుంటాం
మర్రిపాడు, తరిగొండ గ్రామాల్లోని చెరువుల్లో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయమంపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక వీఆర్వో, వీఆర్‌ఏలను ఆదేశించాం. తమ సిబ్బందిని ఎక్కువ సమయం చెరువుల వద్దే ఉండే విధంగా చర్యలు చేపడతాం. నిబంధనలను ఉల్లంఘించి ఇసుక అక్రమంగా తరలిస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయిస్తాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, గుర్రంకొండ
Comments
Please login to add a commentAdd a comment