నేడు ఐచ్ఛిక సెలవు
రాయచోటి (జగదాంబసెంటర్) : అన్ని ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఈ నెల 24న ఐచ్ఛిక సెలవుగా ప్రకటించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ, మండల విద్యాశాధికారులు, అన్ని యాజామాన్యాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన తెలియజేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి డిసెంబర్ 24 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐసీడీఎస్ పీడీ రమావేవి ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు 12, సహాయకులు 93, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు 11 పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ధరఖాస్తుఫారాన్ని annamayya. ap. gov. in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. లేనిపక్షంలో సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నుంచి పొందొచ్చని తెలిపారు.
చౌక దుకాణాల నిర్వహణకు..
రాయచోటి టౌన్ : రాయచోటి రెవెన్యూ పరిధిలోని 10 మండలాల్లో ఉన్న 116 చౌక దుకాణాల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌డీవో ఏ. శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్నమండెంలో –15, గాలివీడు –12, గ్రుంకొండ –9, కలకడ –10, కంభంవారిపల్లె–9, లక్కిరెడ్డిపల్లె – 8, పీలేరు – 10, రామాపురం – 24, రాయచోటి – 12, సంబేపల్లె –07 దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్ పాస్ అయి ఉండాలని, 18 –40 సంవత్సరాల లోపు వారై ఉండాలన్నారు. ఆయా ప్రాంతాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం
రాజంపేట టౌన్ : విజయవాడలో ఈనెల 28వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరిగే ఆరో తెలుగు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు రాజంపేట పట్టణానికి చెందిన తెలుగుపండితుడు గంగనపల్లి వెంకటరమణకు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సోమవారం ఆయన ఇక్కడ విలేకరులకు తెలిపారు. అమ్మభాషను కాపాడుకుందాం..ఆత్మాభిమానం పెంచుకుందాం అన్న నినాదంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం, కేబీఎన్ కళాశాల సంయుక్తంగా ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెంకటరమణకు తెలుగుభాషా సంరక్షణ సమితి ప్రతినిధులు బొట్టు రామచంద్రయ్యనాయుడు, బీవీ.నారాయణరాజు అభినందనలు తెలిపారు.
జెడ్పీ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ
సిద్దవటం : మండలం లోని భాకరాపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మొదట మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడారు. ఈరోజు మధ్యాహ్నభోజనంలో మెనూ ఏముందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆఫీసు రూమ్‌లోకి వెళ్లి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల ఆన్‌లైన్ హాజరును పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కష్టపడి చదవాలని, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకేశమ్మ, ఫిజికల్ డైరెక్టర్ రామచంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు,పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పూలు, బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి,భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment