విద్యుత్ చార్జీల బాదుడుపై 27న పోరుబాట
రాయచోటి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పెంచిన విద్యుత్ చార్జీల మోతను నిరసిస్తూ ఈనెల 27వ తేదీన ప్రతి నియోజకవర్గంలోని విద్యుత్ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరుబాటను చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు.దీనిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, కౌన్సిలర్లు, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపై చార్జీల మోత మోగిస్తోందని అమరనాథ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల కాలంలో విద్యుత్ చార్జీలను పెంచమంటూ బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చిన దాఖలా లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎక్కడా విద్యుత్ సమస్యలు ఉండేవి కాదన్నారు. రైతులు అడిగిన వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు మంజూరు చేసి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించి అన్ని వర్గాల ప్రజలకు తోడుగా నిలిచిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈనెల 27వ తేదీ విద్యుత్ చార్జీల బాదుడుపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ పోరుబాట చేపడుతోందన్నారు ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్‌సబ్ స్టేషన్ల ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ మాజీ చైర్మన్ కె హరుణ్ బాషా, మన్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజ్ రహిమాన్, వీరబల్లి మండల నాయకులు, జిల్లా బీసీ నాయకులు విజయభాస్కర్, రాయచోటి పట్టణ అధ్యక్షులు రియాజుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఆకేపాటి అమరనాథరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment