తూటాల కలకలం.. చిక్కుముడి వీడినట్లేనా?
రాయచోటి : రాయచోటి రూరల్ మండలం, మాధవరం అటవీ ప్రాంతంలో కలకలం రేపిన తుపాకీ కాల్పుల ఘటనకు సంబంధించి వేటగాళ్ల ఆనవాళ్లను పోలీసులు పసిగట్టినట్లు సమాచారం. తుపాకులతో అడవి జంతువులకోసం వేటకు వెళ్లిన వారి వివరాలను సేకరించి గోప్యంగా వారికోసం గాలిస్తున్నట్లు తెలియవచ్చింది. ఆదివారం తెల్లవారుజామున అడవి జంతువుల వేటగాళ్ల తుపాకీ తూటాల దెబ్బకు నీలకంఠ హనుమంతు (45) మృతి చెందగా నల్ల రమణ (30) కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు ఛేదనలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, అర్బన్ సీఐ చంద్రశేఖర్‌లు ప్రత్యేక బృందాలతో విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో మాధవరం గ్రామానికి చెందిన కొంతమంది అడవి జంతువులకోసం తెల్లవారజజామున వేట సాగిస్తున్న సమయంలో అడవి జంతువుల అలికిడిగా గుర్తించి చెట్ల చాటున ఉన్న వారిద్దరిపై కాల్పులు జరిపినట్లు స్థానిక వేగుల సమాచారం.
వేటలో మాధవరం వాసులు......
అడవి జంతువుల వేటకు వెళ్లి తుపాకులతో కాల్చిన వారంతా మాధవరం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించిన ట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు గురికానివాండ్లపల్లికి చెందిన ఒక సీనియర్ షూటర్‌తోపాటు పేయలవాండ్లపల్లి, జురుకువాండ్లపల్లి, రెడ్డివారిపల్లిలకు చెందిన వారు వేటలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
రాజకీయ ఒత్తిళ్లు.....
అడవి జంతువుల వేటలో భాగంగా తుపాకీ తూటాలు పేల్చిన వారిని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. జరిగిన సంఘటనను నీరు గార్చే ప్రయత్నంలో భాగంగా కేసును తపుదారి పట్టించి అనామకులు కొంతమందిపై కేసులు నమోదు చేయించి అసలు దోషులను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు సైతం అసలు దోషులు కళ్లెదుట ఉన్నా వారిని అరెస్టు చేయలేని పరిస్థితిలో ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి.
రెండురోజుల్లో వివరాలు వెల్లడిస్తాం : అర్బన్ సీఐ
తుపాకీ కాల్పుల కేసులో సమాచారం ఒక కొలిక్కి వచ్చిందని రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. వేటకు వెళ్లిన వారిని గుర్తించామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వేటకు వెళ్లిన వారి వివరాలను బయట పెడతామని సిఐ చెప్పారు.
పరారీలో వేటగాళ్లు.. ఆనవాళ్లు గుర్తించామంటున్న పోలీసులు?
అసలు దోషులను తప్పించే ప్రయత్నంలో పోలీసులపై రాజకీయ ఒత్తిడులు
Comments
Please login to add a commentAdd a comment