పీబీసీ లైనింగ్లో దోపిడీకి స్కెచ్!
బి.కొత్తకోట: ఏవీఆర్ హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగమైన పుంగనూరు ఉప కాలువ లైనింగ్ పనులను ప్రభుత్వం టెండర్ లేకుండా అప్పనంగా అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి సీఈ పంపిన ప్రతిపాదన నివేదిక మేరకు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో సాగే పుంగనూరు ఉపకాలువకు కిలోమీటర్ 75.00 నుంచి కిలోమీటర్ 189.00 వరకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపి రూ.480.22 కోట్ల పనిని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి కట్టబెడుతూ ఉత్తర్వు జారీ చేసింది. అసలు ఈ జీఓ జారీ, పనుల అప్పగింత, నిధుల కేటాయింపు, ఏ పని ఎంత చేయాలి, డిజైన్, పని స్వరూపం తదితర వాటికి సంబంధించి స్పష్టత లేకనే పనులకు అనుమతి ఇవ్వడంపై నీటి పారుదల రంగ నిపుణులు విస్తుపోతున్నారు.
పని చేయకనే నిధుల మిగులా..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమ కరువు నివారణ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు ఉపకాలువను వెడల్పు చేసి గండికోట రిజర్వాయర్ నుంచి 800 క్యూసెక్కుల కృష్ణా జలాలను అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు తరలించాలని నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,929 కోట్లు మంజూరు చేయగా హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 1,217 కోట్లకు పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకుంది. కంపెనీ కొంతమేర పనులు చేయగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 25శాతం లోపు పనులను రద్దు చేసుకుంది. దీంతో ఈ పని కూడా రద్దయినట్టే. అయితే పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనికి రూ.485.10 కోట్లు మంజూరు చేయాలని తిరుపతి సీఈ నివేదిక మేరకు రూ.480.22 కోట్లకు మంజూరు చేస్తున్నట్టు జీఓలో పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,929 కోట్లు మిగిలాయని, ఆ నిధుల్లో రూ.480.22 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు.
కుప్పం కోసమే పెంపు
పుంగనూరు ఉప కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం 145 క్యూసెక్కులు ఉంటే కుప్పం నియోజకవర్గం కోసం కిలోమీటర్ 189.800 నుంచి కిలోమీటర్ 207.800 వరకు కాలువను వెడల్పు చేస్తారు. ఇక్కడి నుంచి నీటి ప్రవాహ వేగం 282 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి ముందే చెప్పింది
పుంగనూరు ఉప కాలువ పనిని ప్రభుత్వం టెండర్లు లేకుండా నామినేషన్‌పై కట్టబెట్టేలా చూస్తోందని సాక్షి దినపత్రికలో ఈనెల 8న టెండర్లా.. నామినేషనా అన్న శీర్షిక కథనం ప్రచురితమైంది.
●కాంట్రాక్టర్‌కు దోచి పెట్టాలనే..
కాకి లెక్కలతో రూ.480.22 కోట్ల పని అప్పగింత ఉత్తర్వు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన పీబీసీ వెడల్పు పనుల
నిధులు రూ.1,929 కోట్లు మిగిలాయట
ఈ పని రద్దు చేయకనే అదే కాంట్రాక్టు సంస్థకు నామినేషన్‌పై పనులు అప్పగించేసిన ప్రభుత్వం
పీబీసీ వెడల్పు పనులను రద్దు చేయని ప్రభుత్వం అదే పని నిధులు మిగులుగా చూపిస్తూ.. ఈ మిగులు నిధులతో పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనులు చేపడుతున్నట్టు జీఓలో ప్రభుత్వం చెప్పడం చూస్తే అంతా అవినీతి కథలా కనిపిస్తోంది. టెండర్ల నిర్వహణ లేకుండా నామినేషన్‌పై నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి కాలువ వెడల్పు పనుల ఒప్పందం మేరకు అంటూ అప్పగించేసింది. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్టు పనులు చేసుకునేలా, ఇష్టమొచ్చినంత బిల్లులు పెట్టుకుని దోచుకునేలా ఈ జీఓ ఉందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment