ఉద్యమాల నేల.. ఉప్పెనైన వేళ! | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాల నేల.. ఉప్పెనైన వేళ!

Published Wed, Aug 14 2024 8:56 AM | Last Updated on Wed, Aug 14 2024 12:35 PM

-

ఆంగ్లేయులపై పోరులో మంతెనవారిపాలెం ప్రత్యేకత

రాజకీయ పాఠశాలలో ఎందరో నేతలకు ‘స్వతంత్ర’ పాఠాలు

ఆనాటి పాలకులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రజలు

జాతిపిత గాంధీ పర్యటించిన ప్రాంతంగా ఎంతో గుర్తింపు

బాపట్ల: స్వతంత్ర ఉద్యమంలో ఆ గ్రామం చూపిన తెగువ ఈనాటికీ చరిత్రలో ముఖ్య స్థానం పొందింది. ఇక్కడి ప్రజల చైతన్యం నేటి తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. పిట్టలవానిపాలెం మండలంలోని మంతెనవారిపాలెం గ్రామానికి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఉప్పెనలా బ్రిటిష్‌ పాలకులపై విరుచుకుపడింది. పన్నుల నిరాకరణ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు ఆనాటి ఆంగ్లేయ పాలకులను ముప్పుతిప్పలు పెట్టారు. 1922లో మహాత్మాగాంధీ ఇక్కడ పర్యటించిన సందర్భంలో ఆయనకు మంతెనవారిపాలెం ఆతిథ్యమిచ్చింది.

గాంధీ హరిజన నిధి సేకరించగా స్థానిక నాయకులతోపాటు మహిళలు సైతం తమకు తోచినవిధంగా డబ్బుతోపాటు బంగారు ఆభరణాలనూ విరాళంగా అందించారు. తద్వారా స్వాతంత్య్ర ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నారు. 1933లో జాతీయ స్థాయిలో రాజకీయ పాఠశాల స్థాపించి దేశ నేతలకు కూడా పాఠాలు నేర్పిందీ నేల. ఉద్యమాల పురిటి గడ్డగా స్వతంత్ర పోరాట చరిత పుటల్లో చెరగని స్థానం సంపాదించింది. ఎందరో ఉద్యమకారులకు సేచ్ఛా సమరంలో శిక్షణ ఇచ్చింది.

పోలీసు కాల్పులకు ఎదురొడ్డి..
1942లో క్విట్‌ ఇండియా మూమెంట్‌లో ఇక్కడి నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే సమయంలో చాలామంది లాఠీచార్జి చేసినా బెదరలేదు. పోలీసు కాల్పులకు ఎదురొడ్డి మరీ గాయపడ్డారు. అరైస్టె మరికొందరు జైలుకెళ్లారు. 1933లో ఆల్‌ ఇండియా రాజకీయ పాఠశాలను మంతెనవారిపాలెంలో నిర్వహించారు. అనేకమంది నాయకులు ఇక్కడ శిక్షణ పొందడానికి అవకాశం కల్పించారు. అప్పటి సోషలిస్ట్‌, కమ్యూనిస్టు భావాలు కలిగిన కాంగ్రెస్‌ నాయకులు కూడా ఇక్కడ తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ నాయకులైన కాసు బ్రహ్మానందరెడ్డి, ఆలపాటి వెంకట్రామయ్య, వెనిగళ్ల సత్యనారాయణ వంటి వారిని రాజకీయ ప్రవేశం చేయించిన ఘనత వెంకటరాజుదే.

మహాత్మాగాంధీ పర్యటన..
1929లో గాంధీ ఈ గ్రామానికి వచ్చి హరిజన నిధి పేరుతో బంగారు నగలు, నగదును ప్రజల నుంచి విరాళంగా సేకరించారు. ఇక్కడి వారు విరివిగా తమవంతు విరాళాలు అందించారు. కనుమూరి వెంకటరాజుకు చెందిన ఇంటిలో గాంధీ విశ్రాంతి తీసుకున్నారు. ఆ ఇంటిని నేటికీ గ్రామంలో చూడవచ్చు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతోపాటు వీరందరి సేవలను, ఆనాటి సమర ఘట్టాలను ఇక్కడి వారు స్మరించుకుంటారు.

మంతెన.. ప్రత్యేక ముద్ర..
ఈ గ్రామంలో జన్మించిన మంతెన వెంకటరాజు స్వాతంత్య్ర స్ఫూర్తికి నడుం బిగించి, ఎంతోమంది యువకులను ఉద్యమం వైపు నడిపించారు. మంతెన వెంకటరాజు తన 17వ ఏటనే చదువుకు స్వస్తి చెప్పారు. 1921లో స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. 1932లో విదేశీ వస్త్రాలు బహిష్కరించి, కల్లుపాకల వద్ద పికెటింగ్‌ చేసిన కారణంగా కారాగార జీవితం అనుభవించాల్సి వచ్చింది. 1933లో స్వామి సీతారామ్‌ అధ్యక్షతన మంతెనవారిపాలెంలో 40 అడుగుల ఎత్తున దిమ్మె నిర్మించి గాంధీ విగ్రహాన్ని మొట్టమొదట స్థాపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement