No Headline
తహసీల్దార్‌ను కలిసిన బాధిత రైతులు
జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని హామీ
కొన్నిచోట్ల అరటి తోటలకూ ఇదే దుస్థితి
తెనాలి: జూలై నెలలో, గత నెల 31, సెప్టెంబరు ఒకటో తేదీన కురిసిన భారీ వర్షాలకు తోడు వరద పోటెత్తడంతో నిమ్మ తోటల్లో అసాధారణమైన రీతిలో నీరు నిలిచింది. కాజ టోల్‌గేట్, ఆ పరిసరాల్లోని వరద నీరు దిగువకు ప్రవహించింది. గుంటూరు నల్ల, తుంగభద్ర డ్రెయిన్లకు వరద పోటెత్తింది. దీంతో తెనాలి నియోజకవర్గంలోని సంగంజాగర్లమూడి, అంగలకుదురు, వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు పరిధిలోని పంట చేలను ముంచెత్తింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో సాగు చేసే నిమ్మ తోటల్లోనూ వరద నీరు చేరింది. 7–8 అడుగుల ఎత్తులో ఉండే నిమ్మతోటల్లో 4–6 అడుగుల మేర ముంపు తప్పలేదు. ఈ నెల 10వ తేదీ వరకూ పూర్తిస్థాయిలో నీరు బయటకు వెళ్లనేలేదు.
అటువైపు చూసిన వారే లేరు..
ఈ పరిణామం నిమ్మ రైతులను కలవరపెట్టింది. తోటల్లో నీరు ఎక్కువ రోజులు నిలిచి ఉండటం గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదు. దీంతో మొక్కలకు నష్టం జరుగుతోంది. పెద్ద తోటల్లో కొత్త చిగురు రాకుండా తెగుళ్లు ఆశిస్తూ, క్రమంగా చెట్టు ఎండిపోతోదని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నిమ్మ చెట్టు 15–20 ఏళ్ల వరకు కాపునిస్తుంది. అలాంటి చెట్టు చనిపోతే మళ్లీ కొత్త మొక్క నాటి, అది పెరిగి, దిగుబడి రావటానికి అయిదేళ్లు పడుతుందని తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యాన అధికారులు, సంబంధిత శాస్త్రవేత్తలు నిమ్మ తోటలను పరిశీలించి, తగిన సూచనలు చేయాలని రైతులు కోరారు. ఆ పరిశీలన సంగతి అటుంచితే.. ఇప్పటి వరకు నిమ్మతోటలకేసి ఎవరూ రానే లేదని వారు వాపోతున్నారు.
నిమ్మ, అరటి తోటలకు పరిహారమేదీ?
పంట నష్టం నమోదులో నిమ్మ తోటలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అదేమంటే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తగిన ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారని తెలిపారు. దీనితోపాటు కొల్లిపర మండలంలోని కొన్ని గ్రామాల్లో వరద నీటిలో రోజుల తరబడి ఉన్న అరటి తోటలను కూడా పంట నష్టంలో పరిగణనలోకి తీసుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యలో బుధవారం పలువురు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి నేతృత్వంలో తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను కలిశారు. రైతుల ఆవేదనను విన్న తహసీల్దార్.. ఫోన్‌లో ఉద్యాన అధికారితో మాట్లాడారు. తెనాలి మండలం అంగలకుదురు, సంగంజాగర్లమూడి గ్రామాల్లో నిమ్మ, అరటి పంటల నష్టాన్ని ఎందుకు నమోదు చేయటం లేదని ప్రశ్నించారు. అందుకు తగిన ఉత్తర్వులు లేవని వారు సమాధానమిచ్చారు. దీంతో సమస్యను జిల్లా కలెక్టర్, ఉద్యానశాఖ అధికారి దృష్టికి తీసుకెళతానని తహసీల్దార్ సదరు రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.10 వేలు, రూ.14 వేలు ఏమాత్రం సరిపోవని రైతులు వెలగా ఆదినారాయణ, పాపోపలు శ్రీనివాసరావు చెప్పారు. పరిహారం ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment