అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన | - | Sakshi
Sakshi News home page

అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన

Published Fri, Oct 18 2024 3:02 AM | Last Updated on Fri, Oct 18 2024 3:02 AM

అంజన్

అద్దంకి రూరల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో స్వామి వారికి గురువారం పౌర్ణమి సందర్భంగా లక్ష తమలపాకులతో పూజ వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఉదయం నుంచి స్వామి వారికి సుప్రభాత సేవ, గోపూజ, బిందెతీర్థం, అభిషేకం చేశారు. అనంతరం దేవస్థాన పండితులు, అర్చకులు లక్ష తమలపాకులతో పూజ నిర్వహించారు. అనంతరం స్వామి వారికి మహా నివేదన, పంచహారతులు చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

దేశానికి గొప్ప కావ్యాన్ని అందించిన వాల్మీకి

బాపట్ల: సంస్కృతంలో రామాయణాన్ని రచించి దేశానికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. వాల్మీకి జయంతి కార్యక్రమం గురువారం కలెక్టరేట్లో జరిగింది. మహర్షి చిత్రపటానికి ఆయన పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీవో పి.గ్లోరియా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రఖర్‌ జైన్‌ మాట్లాడుతూ.. దేశంలోనే సంస్కృతంలో పద్యాలు రాసిన తొలి కవిగా వాల్మీకి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. వేటగాడైన వాల్మీకి మహా ఋషిగా మారిన తీరు ఆదర్శనీయం అని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిణి శివలీల, సీపీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె ఖాయం

పిడుగురాళ్ల: ఎన్టీఆర్‌ వైద్యసేవ సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని పల్నాడు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిబాబా రాజు అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదన్నారు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ) పథకాన్ని ఇన్సూరెన్స్‌ విధానంలోకి మార్పు చేసినా పథకంలో పని చేస్తున్న ఫీల్డ్‌ సిబ్బందికి న్యాయం జరగడం లేదన్నారు.

పవర్‌ లిఫ్టింగ్‌లో జ్యోతి వర్మకు పతకం

మంగళగిరి: గోవాలో జరుగుతున్న నేషనల్‌ సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ మాస్టర్స్‌ మెన్‌ , ఉమెన్‌ బెంచ్‌ ప్రెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరుకు చెందిన పవర్‌ లిఫ్టర్‌ పి. జ్యోతి వర్మ బ్రాంజ్‌ మెడల్‌ సాధించినట్లు గురువారం జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, సంధాని తెలిపారు. పవర్‌ లిఫ్టింగ్‌లో నేషనల్‌ స్థాయిలో మాస్టర్‌ 2ప్లస్‌ 50 ఇయర్స్‌ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి పవర్‌ లిఫ్టర్‌ జ్యోతి వర్మని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గంట వెంకటేశ్వరరావు, కార్యదర్శి సకల సూర్యనారాయణతో పాటు ప్రతినిధులు అభినందించినట్లు తెలిపారు.

నృసింహ స్వామికి రూ. 45.51లక్షల ఆదాయం

మంగళగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామికి రూ.45,51,136 ఆదాయం లభించిందని ఈవో ఏ. రామకోటిరెడ్డి తెలిపారు. స్వామి దిగువ సన్నిధి, ఎగువ సన్నిధిలతో పాటు ఘాట్‌ రోడ్డుపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించినట్లు పేర్కొన్నారు. ఎగువ సన్నిధిలో రూ. 18,90,274, దిగువ సన్నిధిలో రూ. 25,30,803, వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 85,800తో పాటు అన్నదానానికి రూ. 44,259 సమకూరినట్లు తెలిపారు.గత మూడు నెలల కంటే ప్రస్తుతం రూ. 29,259 అదనంగా వచ్చినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన 1
1/3

అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన

అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన 2
2/3

అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన

అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన 3
3/3

అంజన్నకు లక్ష తమలపాకుల అర్చన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement