మద్యం సిండికేట్లతో పేదల జీవితం ఛిద్రం
– సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి
చీరాల: రాష్ట్రంలో సిండికేట్లు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, దీంతో పేదల జీవితాలు ఛిద్రమవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో సీపీఎం చీరాల ప్రాంతీయ మహాసభలో మాట్లాడారు. మద్యం మత్తులో అనేక చోట్ల మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. మద్యం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ఓటు హక్కును కాజేసేందుకు ప్రధాని మోదీ జమిలి ఎన్నికలు తీసుకువచ్చి పెత్తనం చేయాలని చూస్తున్నారన్నారు. మోదీ నియంతృత్వ పోకడకు టీడీపీ, జనసేన కూడా మద్దతు ఇస్తున్నాయన్నారు. ఇదే జరిగితే ఉద్యోగ, జీవిత భద్రత లేకుండా పోతుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లాకు పరిశ్రమలను తీసుకురావాలని.. జిల్లాలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. చీరాల పట్టణంలో ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని సీపీఎం చీరాల కార్యదర్శి ఎన్.బాబూరావు కోరారు. చేనేత నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత వృత్తిలో ఉపాధి కల్పించాలన్నారు. సీపీఎం జిల్లా నాయకులు సీహెచ్ మజుందార్, ప్రజానాట్యమండలి కళాకారులు పి.కిరణ్, ఎం.సత్యమూర్తి, ఎం.అయ్యప్పరెడ్డి గీతాలాపన చేశారు. సీపీఎం నాయకులు ఎం.వసంతరావు, ఎల్.జయరాజు, పి.కొండయ్య, డి.నారపరెడ్డి, బి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment