బాపట్లటౌన్: కార్తికమాసం ప్రారంభం కావటంతో భక్తులు శైవక్షేత్రాలను దర్శించుకున్నారు. ముఖ్యంగా మహిళలు తెల్లవారుజామునే సూర్యలంక తీరానికి చేరుకొని తీరంలో పుణ్యస్నానాలుచేసి తీరం ఒడ్డున పసుపు, కుంకుమ, ఐదు రకాల పూలు, పండ్లతో గౌరిదేవి పూజలు నిర్వహించారు. గౌరీదేవి ప్రతిమలను సూర్యలంక తీరంలో కలిపి సూర్యనమస్కారాలతో కూడిన స్నానాలు ఆచరించారు. స్నానాల అనంతరం తీరం వెంబడి ఉన్నటువంటి తారకేశ్వరస్వామి దేవాలయం, ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులతో పోటెత్తిన శివాలయాలు
బాపట్ల పట్టణంలో వేంచేసియున్న సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు శనివారం తెల్లవారుజామున పోటెత్తారు. పుణ్య స్నానాలనంతరం అధిక సంఖ్యలో మహిళలు సోమేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు గంటల వరకు స్వామివారికి విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి భారీసంఖ్యలో చేరుకున్న మహిళలు ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన, గౌరీదేవి పూజలు, పుష్పార్చన కార్యక్రమాలను కనుల పండుగగా నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌ఎన్‌పీ అగ్రహారంలోని గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, త్యాగరాయనగర్‌లోని శ్రీ రమా సహిత సత్యనారాయణస్మామి, మండలంలోని వెదుళ్లపల్లిలో గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, అప్పికట్లలోని అన్నపూర్ణ సహిత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ప్రారంభం అయిన కార్తిక మాసం శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు తెల్లవారుజామునే తీరంలో పుణ్యస్నానాలాచరించిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment